బదిలీలపై రోదిస్తున్న ఉపాధ్యాయురాలు ( ఆడియో వైరల్)

by  |
బదిలీలపై రోదిస్తున్న ఉపాధ్యాయురాలు ( ఆడియో వైరల్)
X

దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల్లో గందరగోళం నెలకొంది. తమకు అనుకూలంగా లేని, సుదూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చారంటూ ఉపాధ్యాయులు రోదిస్తున్నారు. నిజానికి వారికి ఏడుపు ఒక్కటే మిగిలింది. ఓ ఉపాధ్యాయురాలు ఆ సంఘం నాయకులతో రోదిస్తూ తన గోడు వెల్లబోసుకుంటున్న ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని విధులు నిర్వహించానని, మహిళనని కూడా చూడకుండా తమ ఇష్టానుసారం పోస్టింగ్‌లు వేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు ఎలా వెళ్లి రావాలని ఆమె ఆవేదన వెళ్లగక్కింది. విద్యాశాఖ, జిల్లా అధికారులపై బండ బూతులు తిడుతూ శాపనార్థాలు సందించారు. జీవితంపై విరక్తి కలుగుతోంది, ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ బాధలు అర్థం చేసుకోవట్లేదని ఆమె విలపించారు. సీనియారిటీ ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు.

నల్లగొండ జిల్లా చండూరు మండలం నుంచి యాదాద్రి జిల్లాకు బదిలీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపాధ్యాయురాలు రోదిస్తున్న ఆడియో విన్న పలువురిని కంటతడి పెట్టిస్తోంది. దీంతో ధర్నాలు, నిరసనలు తెలపాలని ఉపాధ్యాయ సంఘం నేతలు సూచిస్తున్నారు. పోస్టింగ్‌లో తమకు అన్యాయం జరిగిన వారంతా డీఈవో, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే ఉపాధ్యాయ బదిలీల్లో జరుగుతున్న లొసుగుల‌పై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు అక్రమంగా తమకు పోస్టింగ్‌లు ఇస్తున్నారంటూ, విలపిస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Next Story

Most Viewed