ఎన్టీఆర్ నో.. మరి టీడీపీ పరిస్థితి ఏంటో?

by  |
ఎన్టీఆర్ నో.. మరి టీడీపీ పరిస్థితి ఏంటో?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తాడా?.. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తిరిగి రావడం ఖాయమా?.. గత కొంతకాలంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌ మేరకు వచ్చే ఎన్నికల్లో తారక్ రాజకీయాల్లోకి వస్తాడా?.. ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు ఖచ్చితంగా ‘నో’ అని చెప్పవచ్చు.

త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న క్రమంలో నిర్వాహకులు ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో భాగంగా రాజకీయాల్లోకి మళ్లీ ఎప్పుడోస్తారంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు. రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం, సందర్భం కాదని, దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని తెలిపాడు.

ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఇప్పట్లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే పరిస్థితి లేదని క్లియర్‌గా అర్థమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ తిరిగి టీడీపీలోకి రావాలని కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తిరిగి రావాలంటూ సోషల్ మీడియాతో పాటు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఎన్టీఆర్ రావాలంటూ కార్యకర్తలు, అభిమానులు డిమాండ్ చేశారు.

దీంతో ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరిగి టీడీపీలోకి వస్తారేమోనని చాలామంది కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ.. రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదంటూ తాజాగా ఎన్టీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. ఎన్టీఆర్ రాకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి కష్టమేనని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వయస్సు దృష్ట్యా చంద్రబాబు ఇంతకుముందులా యాక్టివ్‌గా పనిచేయలేని పరిస్థితి. ఇక లోకేష్ నాయకత్వాన్ని చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ చేసిన ప్రకటన టీడీపీ కార్యకర్తలను నిరాశపర్చింది.


Next Story