బ్యూటీ ఉత్పత్తుల విక్రయాలకు టాటా డిజిటల్ కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్!

by  |
Nykaa rival
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా డిజిటల్ దేశీయంగా సౌందర్య సాధనాల ఉత్పత్తుల విక్రయం కోసం కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో విజయవంతంగా కొనసాగుతున్న నైకా, పర్పుల్, మైగ్లామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా టాటా డిజిటల్ తన కొత్త ఈ-కామర్స్ సంస్థను తీసుకురానుంది. అయితే ప్రస్తుతం టాటా అనుబంధంగా ఉన్న టాటా క్లిక్ సంస్థకు భిన్నంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందని సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కొత్తగా తీసుకురానున్న ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం సౌందర్య, సంబంధిత సాధనాల(బ్యూటీ, కాస్మొటిక్) ఉత్పత్తులను మాత్రమే విక్రయించనున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులను సంస్థ తన టాటా క్లిక్, వెస్ట్‌సైడ్ లాంటి స్టోర్లలో విక్రయిస్తోంది. ఇకపై దీన్ని విడిగా నిర్వహించనుంది.

‘టాటా డిజిటల్ విభాగం దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ వ్యాపారాలను వైవిధ్యంగా నిర్వహించాలని భావిస్తోంది. త్వరలో ప్రారంభించబోయే ప్లాట్‌ఫామ్ సైతం వేగవంతమైన వృద్ధిని సాధించేదిగా నిలుస్తుందని’ సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. గత కొన్ని నెలలుగా దేశీయంగా సౌందర్యం, ఆరోగ్య సంరక్షణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొవిడ్ మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ విక్రయాలు భారీగా పెరగడంతో బ్యూటీ మార్కెట్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. 2025 నాటికి భారత బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ మార్కెట్ రూ. 32.3 వేల కోట్లకు చేరుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ఉత్పత్తులను కొనే వినియోగదారులుగా దేశవ్యాప్తంగా 2.5 కోట్లు ఉండగా, 2025 నాటికి 11 కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది.



Next Story

Most Viewed