గణేశ్ నిమజ్జనంపై సస్పెన్స్

by  |
గణేశ్ నిమజ్జనంపై సస్పెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం వద్దని గత వారం హైకోర్టు తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమని, తీర్పులో సవరణలు చేసి నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అత్యవసర పిటిషన్‌గా భావించి వెంటనే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. పైగా తక్షణం విచారించాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఈ పిటిషన్‌పై సోమవారం లంచ్ మోషన్ తరహాలో విచారణకు చేపట్టనున్నట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గణేశ్ నిమజ్జనానికి సమయం దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తాజా విజ్ఞప్తిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగుల తదితర రసాయనాలతో విగ్రహాలను తయారుచేసి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడం ద్వారా జలాలు కాలుష్యం అవుతాయని స్పష్టం చేసిన హైకోర్టు ఆ విగ్రహాలను ఎక్కడికక్కడ కుంటలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని ఇటీవలి తీర్పులో స్పష్టం చేసింది. నిజానికి రెండేళ్లుగా ఈ సమస్య ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని వేదిస్తూనే ఉన్నది. హుస్సేన్ సాగర్ జలాల కాలుష్యంపై ప్రతీ ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంగా కోర్టుకు చేరుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం ఏమీ లేకపోవడంతో ఈసారి కూడా అదే సమస్య వచ్చిపడింది. దీంతో ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితిపై ఆందోళన పడిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆదివారం ఖైరతాబాద్ గణేశ్ మండపాన్ని సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు పెద్ద మనసుతో ఆలోచించి తగిన నిర్ణయాన్ని వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని, అందువల్లనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన 48 గంటల్లో శుభ్రం చేస్తామని, వ్యర్థాలను లేకుండా చూస్తామని తెలిపారు.

వినాయక చవితి పండుగ దగ్గర పడిన సమయంలో హైకోర్టు తన తీర్పును వెల్లడించినందున ఆగమేఘాల మీద ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేకపోయామని, అప్పటికే అనేక మండపాలకు విగ్రహాలు కూడా చేరుకున్నాయని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఒకవేళ హైకోర్టు తన తొలి అభిప్రాయాన్ని మార్చుకోని పక్షంలో పెద్ద సైజు విగ్రహాలను నిమజ్జనం ఎలా చేయాలన్నది ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి మింగుడుపడడంలేదు. ఈ నెల 21వ తేదీన నిమజ్జనం జరగనున్నందున వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు చేరుకోనున్నాయి. హైకోర్టు అనుమతి ఇవ్వని పక్షంలో వీటికి ప్రత్యామ్నాయం కనుగొనడం సవాలుగా మారింది.

తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌లో ప్రస్తుతానికి పరిమిత స్థాయిలో అనుమతి ఇచ్చి వచ్చే ఏడాది నుంచి పటిష్టంగా అమలయ్యేలా వెసులుబాటు ఇస్తే బాగుంటుందన్న రిక్వెస్టు చేసినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు నగరంలోని లక్షలాది విగ్రహాల నిమజ్జనానికి అవసరమయ్యే కుంటలను, తాత్కాలిక చెరువులను ఏర్పాటుచేయడం సాధ్యం కాదన్న అంశాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. నిజానికి రెండేళ్ళ క్రితమే ఇలాంటి పిటిషన్‌పై విచారణ సందర్భంగా నగరంలో కనీసంగా 150 చోట్ల కుంటలను, తాత్కాలిక పాండ్‌లను నిమజ్జనం కోసం నిర్మించాలని హైకోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పెడచెవిన పెట్టి కేవలం 30 చోట్ల మాత్రమే అలాంటివి ఏర్పాటుచేసింది.

Next Story

Most Viewed