బండ్లగూడ సూరం చెరువుని మింగేశారు

by  |
బండ్లగూడ సూరం చెరువుని మింగేశారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత చెరువుల కబ్జా యథేచ్ఛగా సాగుతోంది. అదెక్కడో మారుమూల ప్రాంతంలోనో, పల్లెల్లోనో కాదు. హైదరాబాద్ నడిబొడ్డునే కబ్జా చేసేస్తున్నారు. కబ్జాకు పాల్పడిన వారు పేదలేం కాదు. గుడిసెవాసులు అసలే కాదు. హై రైజ్ బిల్డింగులు దర్శనమిస్తున్నాయి. దాంతో అక్రమార్కులు పెద్దలేనని స్పష్టమవుతోంది. చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలోనే భవనాలు నిర్మించారని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ స్పష్టం చేస్తోంది.

ఐదేండ్ల నాటి మ్యాపులకు, నేటి మ్యాపుల మధ్య వ్యత్యాసం గుర్తించొచ్చు. ఈ చెరువు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. దానికి ఐడీ నంబరు 4001 ఇచ్చారు. హైదరాబాద్ బండ్లగూడ దగ్గరున్న సూరం చెరువు పక్కాగా కబ్జాకు గురైందని, ఆధారాలతో సహా సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డా.లుబ్నాసర్వత్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వెంటనే సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను లోకాయుక్త ఆదేశించింది. సర్వే చేసేటప్పుడు వీడియో చిత్రీకరించాలని, పోలీసు సహకారం తీసుకోవాలని సూచించింది. సూరం చెరువు పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినట్లు అధికారులు కూడా లోకాయుక్తకు వివరించారు. అయితే రాజకీయ ప్రాబల్యం నెలకొందన్నారు. సర్వేకు వెళ్తే స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నట్లు చెప్పారు.

ఐదేండ్లలో పెరిగిన కబ్జా

బండ్లగూడ పరిధిలోని ఈ చెరువు ఐదేండ్లలో చాలా వరకు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. 2016-2021 మధ్యనే చాలావరకు అన్యాక్రాంతమైనట్లు తెలిపారు. ఈ మేరకు గూగుల్ మ్యాపులను లోకాయుక్తకు సమర్పించారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని లుబ్నా సర్వత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువును పూర్తి స్థాయిలో సర్వే చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్‌కు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. సర్వే చేసేటప్పుడు ఫిర్యాదుదారుడికి కూడా సమాచారం ఇవ్వాలని సూచించింది. అక్రమార్కులు అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని స్పష్టం చేసింది.


Next Story