‘పీఎం కేర్స్’ నిధుల బదిలీ అక్కర్లేదు: సుప్రీం

by  |
‘పీఎం కేర్స్’ నిధుల బదిలీ అక్కర్లేదు: సుప్రీం
X

న్యూఢిల్లీ: దాదాపు ఐదు నెలల నుంచి నానుతున్న పీఎం కేర్స్ ఫండ్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. పీఎం కేర్స్ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ ఫండ్‌ (NDRF)కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

పీఎం కేర్స్ నిధులను ఎన్‌‌డీఆర్ఎఫ్‌ (NDRF)కు ట్రాన్స్‌ఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించలేమని తెలిపింది. ఆ నిధులను ఎన్‌డీఆర్ఎఫ్‌ (NDRF)కు బదిలీ చేయడమే సముచితమని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అలా చేసుకోవచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం వివరించింది.

గతంలో లేదా ఇప్పటికీ సహాయక చర్యల కోసం అనేక నిధులు ఏర్పాటవుతూనే ఉన్నాయని, స్వచ్ఛంద విరాళాలు స్వీకరించే పీఎం కేర్స్ (PM Cares) కూడా అలాంటిదేనని వివరించింది. ప్రభుత్వ నిధి ఎన్‌డీఆర్ఎఫ్ ఉన్నంత మాత్రానా పీఎం కేర్స్ (PM Cares)లాంటి ఇతర నిధుల ఏర్పాటుపై నిషేధాజ్ఞలేం లేవని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం (Disaster Management Act)2005లోని సెక్షన్ 46 కింద ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలిపింది. దీనికి ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు అందజేయవచ్చునని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూనే ఉంటాయని వివరించింది.

‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’(Center for Public Interest Litigation) ఎన్జీవో (NGO) దాఖలు చేసిన పిల్‌ను తోసిపుచ్చుతూ సుప్రీం ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. పీఎం కేర్స్ ఫండ్‌కు వస్తున్న నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వెల్లడించలేదని, కరోనా కట్టడి కోసం ఆ నిధులను ఎన్‌డీఆర్ఎఫ్‌ (NDRF)కు బదిలీ చేయాలని కోరుతూ ఎన్జీవో (NGO) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ వేసింది. కరోనా కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద జాతీయ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిల్ (Pill) అభ్యర్థించింది.

ఈ వ్యాజ్యాన్ని (Case) విచారిస్తూ కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి 2019 డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (Disaster Management Plan)సరిపోతుందని, కొత్త ప్రణాళికలేం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పీఎం కేర్స్ ఫండ్‌కు స్వచ్ఛంద విరాళాలే స్వీకరిస్తుందని, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ నిధులను ముట్టుకోవడం లేదని జులై 27న కేంద్ర తరఫున వాదిస్తూ ఎస్‌జీ తుషార్ మెహెతా అన్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ నిధులను (NDRF Funds)) కాగ్ ఆడిట్ చేస్తుందని, కానీ, పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రైవేటు ఆడిటర్లు ఆడిట్ చేస్తారని ప్రభుత్వం ప్రకటించినట్టు ఎన్జీవో తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. పీఎం కేర్స్ ఫండ్ చట్టబద్ధతనూ ప్రశ్నించారు.

కరోనా లాగే ఇతర విపత్తులేవైనా సంభవించినా ప్రజల ప్రాణాల రక్షణార్థం మార్చి 28న కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ‘ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచుయేషన్స్’ (Prime Minister Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్‌కు ప్రధాని ఎక్స్-అఫీషియో చైర్మెన్‌గా వ్యవహరిస్తుండగా, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్-అఫీషియో ట్రస్టీలుగా ఉన్నారు.

ఈ ఫండ్ ప్రకటించగానే ప్రతిపక్షాల నుంచి సందేహాలు వచ్చాయి. ఇప్పటికే పీఎంఎన్‌ఆర్ఎఫ్(PM National Relief Fund) ఉండగా కొత్తగా మరో ఫండ్ అవసరమేమిటని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నించారు. అప్పటి నుంచే పీఎం కేర్స్ ఫండ్ ఎన్‌డీఆర్ఎఫ్‌కు బదిలీ చేయాలన్న డిమాండ్ మొదలైంది.

పీఎం కేర్స్ ఫండ్ ప్రకటిస్తూ ప్రధాని మోడీ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలను ఆహ్వానించారు. పీఎం కేర్ విరాళాలపై పరిమితి లేకపోవడమే కాదు, సంస్థలకూ పన్ను రాయితీ లభిస్తుంది. కార్పొరేట్లు పీఎం కేర్స్‌కు అందజేసిన విరాళాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద చూపెట్టుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

గాంధీ కుటుంబానికి గట్టి దెబ్బ: జేపీ నడ్డా

సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు గాంధీ కుటుంబీకులకు దెబ్బేనని, ఎన్ని కుయుక్తులు పన్నినా నిజం నిప్పులా బయటికివస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ, అతని అనుచరులకు తగిన పాఠం చెప్పినట్టైందని విమర్శించారు. గాంధీ కుటుంబమే పీఎంఎన్ఆర్ఎఫ్‌ (PMNRF)ను సొంత ఖజానాగా వాడుకున్నారని ఆరోపించారు. సుప్రీంతీర్పు వెంటనే కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ అత్యున్నత న్యాయస్థానం పీఎం కేర్స్ చట్టబద్ధతను ఆమోదించిందని, ఈ సందేశం అందిరికీ వినిపించిందని భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

దురదృష్టకరం: ప్రశాంత్ భూషణ్

పీఎం కేర్స్ ఫండ్‌ను సుప్రీంకోర్టు ఆమోదించడం దురదృష్టకరమని సీనియర్ న్యాయవాది ప్రశాత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఆర్టీఐ, కాగ్ తరచి చూసే అవకాశమున్న ప్రభుత్వ నిధి ఎన్‌డీఆర్ఎఫ్‌కు నిధులను బదిలీ అవసరం లేదని పేర్కొని కరోనా రిలీఫ్ పేరుతో ఒక రహస్య ట్రస్టు సొమ్మును కూడబెట్టుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కలుగజేసినట్టైందని అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed