సునిల్ ఛెత్రి.. ఆల్ టైం గ్రేట్ నెంబర్ 2

by  |
సునిల్ ఛెత్రి.. ఆల్ టైం గ్రేట్ నెంబర్ 2
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో పీలే, మరడోనా, రొనాల్డో, మెస్సీ, జినదాన్ వంటి పేర్లే వినపడతాయి. కానీ భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఒక్కరి పేరు కూడా కనపడదు. ఇండియాలో కూడా క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్లేయర్లు తెలిసినంతగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు పెద్దగా పరిచయం ఉండదు. అప్పట్లో బైచింగ్ భూటియా ఒక వెలుగు వెలగగా.. ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ ఛెత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మిగిలిన వాటికి లేకపోవడంతో వారు సాధించే ఘనతలు పెద్దగా వెలుగులోకి రావు. అలాంటి రికార్డునే టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ ఛెత్రి సాధించాడు. ఫుట్‌బాల్ ఆల్ టైం గోల్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. ఫుట్‌బాల్ గోల్స్ అధికారికంగా నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి చేసిన అంతర్జాతీయ గోల్స్‌లో సునిల్ ఛెత్రి తాజగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీని దాటేశాడు. దోహాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 2-0 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఛెత్రి రెండుగోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు గోల్స్‌తో సునిల్ ఛెత్రి మొత్తం అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 74కు చేరింది. కాగా లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 72 గోల్స్ చేశాడు.

రొనాల్డో తర్వాత ఛెత్రి..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లలో అత్యధిక గోల్స్ ఇరాన్‌కు చెందిన అలీదాయ్ పేరిట ఉంది. 1993 జూన్ 6న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన అలీ 2006 జూన్ 21న ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్‌లో 149 మ్యాచ్‌లు ఆడి 109 గోల్స్ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో సెంచరీ గోల్స్ చేసిన తొలి ఆటగాడు అలీనే. ఇక ఆ తర్వాత స్థానంలో పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 2003 అగస్టు 20న అంతర్జాతీయ కెరీర్ స్టార్ట్ చేసిన రొనాల్డో.. 174 మ్యాచ్‌లలో 103 గోల్స్ చేశాడు. వీరిద్దరు కాకుండా మరో 8 మంది టాప్ 10 గోల్స్ లిస్టులో ఉన్నారు. 10వ స్థానంలో టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ ఛెత్రి ఉన్నాడు. 2005 జూన్ 12న అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఛెత్రి 117 మ్యాచ్‌లలో 74 గోల్స్ చేశాడు. అయితే ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ రికార్డు క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానంలో సునిల్ ఛెత్రినే ఉన్నాడు. ప్రస్తుతం సునిల్ ఛెత్రి ఆల్‌టై గ్రేట్ గోల్స్ రికార్డులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛెత్రి తర్వాత యూఏఈకి చెందిన అలీ మబ్కౌత్ (73), అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ (72) కొనసాగుతున్నారు.

ఛెత్రి పేరిట ఎన్నో రికార్డులు..

అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక గోల్స్ రికార్డు మాత్రమే కాకుండా.. ఛెత్రి పేరు మీద ఇతర రికార్డుల చాలా ఉన్నాయి. ఇండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఫుట్‌బాల్ ప్లేయర్‌ ఛెత్రినే. అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు హ్యాట్రిక్స్ నమోదు చేసిన ఏకైక ఫుట్‌బాలర్ రికార్డు కూడా ఇతని పేరిటే ఉన్నది. 2008 ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ ఫైనల్‌లో తజకిస్తాన్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. వియాత్నంతో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మరోసారి, 2018లో ఇంటర్ కాంటినెంటర్ కప్‌లో చైనీస్ తైపీపై చివరి సారిగా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ 1992 నుంచి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఇస్తున్నది. ఈ అవార్డును రికార్డు స్థాయిలో 6 సార్లు సునిల్ ఛెత్రి గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐఎం విజయన్ 3 సార్లు, పాల్ అచేరి, భైఛుంగ్ భూటియా రెండు సార్లు గెలుచుకున్నారు. ఐ-లీగ్‌లో సునిల్ ఛెత్రి 90 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐఎస్ఎల్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఫుట్‌బాలర్ కూడా సునిల్ ఛెత్రినే. అతను మొత్తం 47 గోల్స్ సాధించాడు. మూడు ఖండాల్లో ఆడిన భారత ఫుట్‌బాల్‌గా ఛెత్రి రికార్డు సృష్టించాడు. ఇండియాతో పాటు యూరోప్‌లోని స్పోర్టింగ్ క్లబ్ డి పోర్చుగల్, నార్త్ అమెరికాలోని కాన్సాస్ సిటీ విజర్డ్స్ తరపున ఛెత్రి ఆడాడు.

అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్

1. అలీ దాయ్ (ఇరాన్) – 109 (149 మ్యాచ్‌లు)
2. క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగల్) – 103 (174 మ్యాచ్‌లు)
3. మొక్తార్ దహరి (మలేషియా) – 89 (మ్యాచ్‌లు)
4. ఫెరెక్ పుస్కాస్ (హంగేరి) – 84 (85 మ్యాచ్‌లు)
5. గాడ్ఫ్రే చితాలు (జాంబియా) – 79 (111 మ్యాచ్‌లు)
6. హుస్సేన్ సయీద్ (ఇరాక్) – 78 (137 మ్యాచ్‌లు)
7. పీలే (బ్రెజిల్) – 77 (92 మ్యాచ్‌లు)
8. కునిషిగే కమమోటో (జపాన్) – 75 (76 మ్యాచ్‌లు)
9. బషర్ అబ్దుల్లా (కువైట్) – 75 (134 మ్యాచ్‌లు)
10. సునిల్ చత్రి (ఇండియా) – 74 (117 మ్యాచ్‌లు)
11. అలి మబ్కౌత్ (యూఏఈ) – 73 (90 మ్యాచ్‌లు)
12. లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) – 72 (143 మ్యాచ్‌లు)



Next Story

Most Viewed