మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై విద్యార్ధులు ఫైర్.. రోడ్డు పై ధర్నా

by  |
sabitha-indra-reddy 1
X

దిశ.తాండూరు: గుంతల మయమైన రోడ్లతో విసిగి పోయిన విద్యార్థులు రోడ్డు పై ధర్నాకు దిగారు. ఈ సంఘటన తాండూర్ మండలం గౌతాపూర్, కరణ్ కోట్ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఏళ్ళు గడుస్తున్నా, రోడ్ల పరిస్థితిని అధికారులు గానీ , ఇటు రాజకీయ నాయలకులు గానీ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా, పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినిల్లు అయినటువంటి తాండూరు ప్రాంతంలో రోడ్ల దుస్థితి పై కనీసం కన్నెత్తైనా చూడటం లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్ల పరిస్థితి బాగోలేదని బస్సు సర్వీసులు నడపడం కుదరదని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేయడం బాధాకరం అన్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సమయానికి బస్సు లేకపోవడం, మరోవైపు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున అదీ, ఒక ట్రిప్పు నడపడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారిందన్నారు. గుంతలమయమైన రోడ్ల వల్ల అంబులెన్స్ కూడా సమయానికి రాలేని దౌర్భాగ్యస్థితి పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. నిండు గర్భిణీలు ఆస్పత్రికి వెళ్లే సమయంలో గుంతల మయమైన రోడ్లతో అవస్థలు పడుతున్నారన్నారు.

గతంలో నడిరోడ్డుపై ప్రసవించిన సంఘటన దురదృష్టకరం అంటూ వాహనదారులు ఆటో డ్రైవర్లు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు కల్పించి బస్సు సర్వీసులను పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మాట్లాడుతూ తాండూర్ మండలంలో 3 సిమెంట్ కర్మాగారాలు నెలకొన్నాయని ఫ్యాక్టరీలకు వచ్చే భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed