డ్యామేజ్‌డ్ బ్రెడ్‌తో టేస్టీ ‘బీర్లు’

by  |
డ్యామేజ్‌డ్ బ్రెడ్‌తో టేస్టీ ‘బీర్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రెడ్ వంటింట్లో ఎప్పుడూ కనిపించే ఓ ఫుడ్ ఐటెమ్. ఎప్పుడైనా బాగా ఆకలేసి తినడానికి ఏమీ లేనప్పుడు వెంటనే బ్రెడ్ వైపు చూస్తుంటాం. వెంటనే జామ్ వేసుకొని హ్యాపీగా తినేస్తాం. లేదంటే, కోడిగుడ్డు పగులగొట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాం. ఇంకాస్త ఓపిక ఉంటే..బ్రెడ్ బజ్జీ, బ్రెడ్ హల్వా చేసుకుంటాం. టైమ్ వేస్ట్ చేయకూడదనుకుంటే..పాలల్లో వేసేసుకొని కానిచ్చేస్తాం.లేదంటే రెండు టమాటా ముక్కలు అందులో పెట్టేసి శాండ్‌విచ్‌లా ఆరగించేస్తాం. అదే మరి బ్రెడ్ పాడైతే ఏం చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారు కదా! ఏం చేస్తాం.. చెత్తబుట్టలో పడేస్తాం. అంతే కదా. కానీ యూకేకు చెందిన డిమిట్రిస్-మారియోస్ స్టోయిడిస్, సింగపూర్‌కు చెందిన ట్రావిన్ సింగ్‌ మాత్రం పాడైపోయిన బ్రెడ్‌తో బీర్ తయారు చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. బీర్ తయారు చేయడం వల్ల పర్యావరణానికి ఎలా హెల్ప్ అవుతుంది? అసలు బీరు, బ్రెడ్‌తో పర్యావరణానికి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఆ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

‘బ్రెడ్’ షెల్ఫ్ లైఫ్ రెండు లేదా మూడు రోజులే. ఆ తర్వాత బ్రెడ్ పాడైపోతుంది. చాలా క్యాజువల్‌గా మనం బ్రెడ్ కొంటాం, తింటే తింటాం..పాడైపోతే బయట పడేస్తాం. కానీ, దీనివల్ల మనం పర్యావరణానికి హాని చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మాట కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కదా. అయితే ఒక్కసారి మనం ఫుడ్ వేస్ట్ వల్ల ‘పర్యావరణానికి’ ఎంత నష్టం కలుగుతుందో తెలుసుకుందాం. బ్రిటన్‌కు చెందిన ఫుడ్ వేస్ట్ చారిటీ డబ్ల్యూఆర్ఏపీ లెక్కల ప్రకారం యూకేలో ఏడాదికి 1.9 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతుండగా, అందులో 9లక్షల టన్నుల వరకు బ్రెడ్ వేస్ట్ ఉంటుంది. యూకేలో ఒక కుటుంబం 68 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తుందని తేలింది. ఈ లెక్కన 3 కేజీల ఫుడ్ వేస్ట్ చేయడం వల్ల 23.3 కిలోల కార్బన్ ఎమిషన్స్‌ విడుదలవుతాయని డబ్ల్యూఆర్ఏపీ 2019 రిపోర్ట్‌లో తెలిపింది. అంటే ఫుడ్ వేస్ట్ తగ్గించడమంటే..కర్బన ఉద్గారాలను తగ్గించడమే అవుతుంది. ఈ విషయాన్ని గమనించిన పర్యావరణ ప్రేమికులు స్టొయిడిస్, ట్రావిన్ సింగ్‌ ‘బ్రెడ్’ వేస్ట్‌ను తగ్గించాలనుకుని డిసైడ్ అయ్యారు. బ్రెడ్‌తో బీర్లు తయారు చేసి పర్యావరణానికి మేలు చేస్తున్నారు.

యూకేకు చెందిన డిమిట్రిస్-మారియోస్ స్టొయిడిస్ పాడైపోయిన బ్రెడ్లను కలెక్ట్ చేసి వాటితో ‘ఫ్యూచర్ బ్రూ’ పేరిట బీర్లను ఉత్పత్తి చేస్తున్నాడు. ఫ్యూచర్ బ్రూ ఒక్కో పింట్ (టిన్) బీర్ 160 గ్రాములు సీవో2(కార్బన్ డైయాక్సైడ్)ను తగ్గిస్తుందని, ఇది ఓ వెహికల్ 1.5 కిలోమీటర్ల ప్రయాణంలో విడుదల చేసే కర్బన ఉద్గారంతో సమానమని స్టొయిడిస్ చెబుతున్నాడు. 2022 వరకు తన బీర్ తయారీ వల్ల ఒక మిలియన్ కిలోగ్రాముల సీవో2 తగ్గుతుందని ఆ కుర్రాడు చెబుతున్నాడు. స్టోయిడిస్ ఇంజినీరింగ్ చదువుతూనే ‘ఫ్యూచర్ బ్రూ’ బీర్ తయారీ చేస్తుండగా, వాటిని సౌతంప్టన్, హ్యాంప్‌షైర్‌లలో సేల్ చేస్తున్నాడు. ‘నేను చాలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈ బీర్‌ను తయారు చేశాను. అందుకే రెండు సిటీల్లో మాత్రం వీటిని సేల్ చేస్తున్నాను. నా కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మర్ యాపిల్ హెడ్ క్రిస్ బ్రాడ్, సీరియల్ డిజిటల్ ఎంట్రప్రెన్యూర్ ఆండ్రూ డొయ్‌ ముందుకు రావడం నాకెంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ పెట్టుబడుల సాయంతో ఆపరేషన్స్, ప్రొడక్షన్ స్కేలప్ చేయడమే కాకుండా, యూకే వ్యాప్తంగా ఉన్న షాప్స్, సూపర్ మార్కెట్లలో బీర్లను సప్లయ్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాను. ఇంతవరకు మా బీర్ల వల్ల 11.5 టన్నుల సీవో2ను తగ్గించగలిగాం, లాక్‌డౌన్ టైమ్‌లో 8,500 మంది మీల్స్ అందించగలిగాం. ఇదో నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం’ అని స్టొయిడిస్ తెలిపాడు.

క్రస్ట్ బీర్:

బేకరీలు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో రోజూ బ్రెడ్‌లు పెద్ద మొత్తంలో వేస్ట్ అవుతుండటాన్ని గమనించిన సింగపూర్‌కు చెందిన ట్రావిన్ సింగ్..ఆ వృథాను ఎలాగైన తగ్గించాలని డిసైడ్ అయ్యాడు. అయితే ‘బీర్’ తయారీ ఎలా మొదలైందని తెలుసుకునే క్రమంలో పాత తరంలో బీర్ తయారీకి బ్రెడ్ ఉపయోగించే వారనే విషయం తెలుసుకున్నాడు. వెంటనే సింగపూర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘బ్రెడ్’ వేస్టేజ్‌పై రీసెర్చ్ చేశాడు. ఆ తర్వాత బ్రెడ్, రైస్, క్వినోవా, కార్న్ వేస్టేజ్‌ను తగ్గిస్తూ ‘క్రస్ట్’ అనే బీర్‌ను తయారు చేశాడు. సింగపూర్‌లో ‘క్రస్ట్’ బీర్ మంచి ఆదరణ అందుకుంటుండగా, ఇటీవలే జపాన్‌లోనూ ఈ బీర్లను లాంచ్ చేశాడు. వచ్చే రెండేళ్లలో ఆసియాలోని ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. అంతేకాదు..ఫ్రూట్, వెజిటేబుల్ వేస్టేజ్ తగ్గించేందుకు ‘క్రాప్’ పేరుతో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్‌(జ్యూస్, సోడా)ను వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ చేయనున్నాడు. టీ, కాఫీ వేస్ట్‌లను కూడా ఉపయోగిస్తున్నట్లు ట్రావిన్ తెలిపాడు. 2030 వరకు గ్లోబల్ ఫుడ్ వేస్ట్‌లో వన్ పర్సెంటేజ్ తగ్గించాలన్నదే తమ కంపెనీ లక్ష్యమని ఆ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తెలిపాడు.

Next Story

Most Viewed