సౌత్ ఇండియాలో బెస్ట్.. ఎస్టీపీపీకి మరో అవార్డు

by  |
STPP
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం, మొదలైన విషయాలపై మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినారులో ఈ అవార్డు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా గల సుమారు 525 విద్యుత్తు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో 500 మెగావాట్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్‌గా ఎంపికైంది.

ఈ విభాగంలో సుమారు వంద ప్రభుత్వ మరియు ప్రైవేటు ధర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌లో మొదటినుండి అత్యుత్తమమైన ఆపరేషన్ మరియు మెయింటినెన్స్ పద్ధతులు అవలంభిస్తున్నాని, ఇవి ఆదర్శప్రాయంగా ఉన్నాయని నిర్వాహకుల తరఫున సల్మాన్ మార్కర్ ప్రకటించారు. ఈ అవార్డును త్వరలో సింగరేణి సంస్థకు పంపించనున్నట్లు తెలియజేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంస్థ చైర్మన్ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కాగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫ్లైయాష్‌ను నూరుశాతం పైగా వినియోగిస్తున్నందుకు ఇదే సంస్థ ద్వారా జాతీయ స్థాయి అత్యుత్తమ ప్లాంటుగా గత ఏప్రిల్లో గోవాలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుంది.

తన అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరుతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో నాలుగు సార్లు మంచి ర్యాంకులు సాధించింది. 2017- 18లో 5వ ర్యాంకు, 2019- 20లో 7వ ర్యాంకు, 2018 -19లో 16వ ర్యాంకు, ప్లాంటు ప్రారంభమైన తొలి సంవత్సరం 2016-17 లో 17వ ర్యాంకు సాధించింది. గత ఏప్రిల్ నెలలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకును సాధించింది. ఇదే విధంగా ఉత్తమ ప్రమాణాలతో పనిచేస్తూ మరిన్ని అవార్డులను, గుర్తింపును సాధించాలని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ముందుండాలని డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణ రావు ఉద్యోగులను కోరారు.



Next Story

Most Viewed