వైసీపీలో చల్లారని ముసలం

by  |
raghurama krishnam raju,
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వైసీపీలో ముసలం చల్లరడంలేదు. అధికార పార్టీలోనే ఉంటూ, సొంత పార్టీనే ధిక్కరించి రోజుకో ఆరోపణతో వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలనం రేపుతున్నారు. ఏలూరు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు గత రెండు వారాలుగా అధికార పార్టీకి పంటికింద రాయిలా మారాయి. అసలు రఘురామకృష్ణం రాజు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఆయనకు ఏం కావాలి? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో ఉద్భవిస్తున్నాయి.

వివాదం ఎందుకు మొదలైంది?

ఎంపీ రఘురామకృష్ణం రాజు నియోజకవర్గంలో ఉండి, ఆచంట ఆకివీడు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాలు వస్తాయి. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రఘురామకృష్ణం రాజు తొలుత టీడీపీలో ఆ తరువాత బీజేపీలో కొనసాగారు. ఈ రెండు పార్టీల నుంచి ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే, రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసి వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానానికి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. పారిశ్రామిక వేత్తగా పేరున్న తనకు పార్లమెంటులో వైసీపీ సముచిత స్థానం ఇస్తుందని భావించి, భంగపడ్డారు. అప్పటి నుంచి ఆయనలో అసంతృప్తి పెరిగిందని నియోజకవర్గంలోని కార్యకర్తలు చెబుతుంటారు. ఆ తరువాత ఆయన ప్రధానిని కలవడం, ప్రధాని ఆయనకు లోక్‌సభా వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించడంతో రఘురామకృష్ణం రాజు బీజేపీ వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ క్రమంలో టీటీడీ భూముల వేలం, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందంటూ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికీ వ్యతిరేకంగా గళం విప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై, పార్టీ నిర్ణయంపై బహిరంగ విమర్శలు చేశారు. ఇళ్ల స్థలాల భూముల సేకరణ ప్రక్రియలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేతివాటం చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మీడియా కథనాలను విశ్వాసంలోకి తీసుకుని విమర్శలు చేయవద్దని సూచించారు. ఇక్కడే వివాదానికి బీజం పడింది.

‘జగన్ భిక్షతో గెలవలేదు’

అయినప్పటికీ రఘురామకృష్ణం రాజు శాంతించలేదు. మరోసారి మీడియా ముందుకొచ్చి తాను సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారని, తాను జగన్ భిక్షతో గెలవలేదని స్పష్టం చేశారు. జగనే తనను పోటీ చేయాలని అడిగారని, తాను కనీసం ఆయనను కలిసేందుకూ ఆసక్తి చూపలేదని, ఎయిర్ పోర్టులోనే కలిశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఉండి, భీమవరం, నరసాపురం, ఆకివీడు, ఆచంట ఎమ్మెల్యేలు సొంత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారిపై విమర్శలు చేయలేదన్న వాదన బయల్దేరింది.

సవాళ్లకు ప్రతిసవాళ్లు

రఘురామకృష్ణం రాజు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని, అందుకే పార్టీపై విమర్శలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారంతా మీడియా సమావేశం పెట్టి, పార్టీ అధినేత ఛరిష్మాతో గెలవనప్పుడు పదవికి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన రఘురామకృష్ణం రాజు తనను రాజీనామా చేయాలన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి పోటీ చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానంటూ ప్రతిసవాల్ విసిరారు. దీంతో వివాదం మరింత ముదిరిపోయింది. అదిష్ఠానం ఆదేశాలతో రఘురామకృష్ణం రాజుకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ఆరంభించారు. ఈ క్రమంలో ఆయన సామాజికవర్గంలో కలకలం రేగింది. వారంతా ప్రతిఘటించడం ఆరంభించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ, ఉండి, ఆకివీడు, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో సదరు నియోజకవర్గ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించలేదు. ఎంపీ రక్షణ కోసం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోరా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

సవాళ్ల వెనుక కారణాలివేనా?

వ్యాపారవేత్త అయిన రఘురామకృష్ణం రాజుకు రూ.900కోట్లు అప్పులుండగా, వేల కోట్ల ఆస్థులున్నట్టు సన్నిహితవర్గాల సమాచారం. వ్యాపారవేత్త కావడంతో రాజకీయ ఆశ్రయం కోసం ఎవరి గడప తొక్కకుండా తానే ఎంపీగా మారాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయారు. టీడీపీలో చేరినా ఫలితం లేకపోయింది. దీంతో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీ అయ్యారు. పార్టీలో కీలక స్థానం ఆశించి భంగపడ్డారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ పార్టీలు రెండూ రాష్ట్రంలో పాగావేసే ప్రయత్నంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ఉండడంతో మరోసారి ఆ పార్టీవైపు మొగ్గు చూపడం ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలోనే సొంతపార్టీపై విమర్శలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలో ఆయన సామాజిక వర్గం ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ పరాజయమే టీడీపీ అంతిమ లక్ష్యం కనుక అడక్కుండానే ఎంపీ స్థానానికి మద్దతిస్తుంది. ఈ మూడు పార్టీల సాయంతో విజయం సాధించడం నల్లేరుమీద నడకేనని రఘురామకృష్ణం రాజు భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంపుతామంటూ బెదిరింపులు.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ

టీటీడీ భూముల అమ్మకం, ఇసుక మాఫియా, ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినందుకు తనను చంపుతామని బెదిరిస్తున్నారనీ, కావునా కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారనీ, దిష్టిబొమ్మలకు పట్టిన గతే తనకూ పడుతుందంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోనూ తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. వీటిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించడంలేదనీ, అందుకే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, ఓం బిర్లాతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి కూడా ఈ లేఖను పంపినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed