కాలిబాటా.. ‘ఖాళీ’బాటా?

by  |
కాలిబాటా.. ‘ఖాళీ’బాటా?
X

దిశ, న్యూస్ బ్యూరో:
గ్రేటర్‌ రోడ్ల మీద తగినన్ని ఫుట్‌పాత్‌లు లేక పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ప్రాంతాల్లోనూ ఐఆర్‌సీ నిబంధనలను పాటించకుండానే ఫుట్‌పాత్‌లను నిర్మించారు. దీంతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఫుట్‌పాత్‌లు నిరూపయోగంగా మారుతున్నాయి. కొత్తగా నిర్మించే ఫుట్‌పాత్‌లనైనా నిబంధనల ప్రకారం, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా నిర్మిస్తే.. ఉద్దేశం నెరవేరడమేగాక నగరం మరింత అందంగా కనిపిస్తుంది.

ఐఆర్‌సీ, ఐటీడీపీ పలు పరిశోధనలు చేసి అర్బన్‌ ఏరియాల్లో పాదచారుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో నివేదికలు రూపొందించారు. రోడ్లపై వచ్చే వాహనాలకు, పాదచారులకు ప్రత్యేకంగా రూట్‌లు ఉండేలా ఇందులో సూచనలు చేశారు. నగరంలోనూ హిమాయత్‌ నగర్‌ వద్ద మోడల్‌ ఫుట్‌పాత్‌ను నిర్మించారు. అయితే ఇది వాహనాలకు, చిరు వ్యాపారులకు కేంద్రంగా మారుతోంది. కొత్తగా 60 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా వెసులుబాటు ప్రకారం అధికారులు తమ ఇష్టారీతిన ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఫుట్‌పాత్‌లను వినియోగించుకునేవారు తగ్గిపోతున్నారు. వాహనాల మధ్య నడుస్తూ పాదచారులు గాయాల పాలవ్వడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

అడుగడుగునా నిబంధల ఉల్లంఘన

ఫుట్‌పాత్‌ ఎత్తు 150 మిల్లీమీటర్ల కంటే అధికంగా ఉండకూడదని ఐఆర్‌సీ నిబంధనలు చెబుతున్నాయి. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల పాదచారులు ఫుట్‌పాత్‌ల మీద నడవకుండా రోడ్లమీద నడిచేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. ఎత్తు తక్కువగా ఉన్నట్టయితే రోడ్లు వేసేటపుడు ఫుట్‌పాత్‌ మరింత కిందకు పోతుంది. ఈ సమస్యలు రాకుండా ఉండేలా ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. నడిచేందుకు అనువుగా ఇటుకలతో ఉపరితలాన్ని రూపొందించాలి. వాకర్స్‌ ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాటు చేయాలి. ఒకవేళ బస్టాండ్‌లు వంటివి ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు అవసరమైన నిర్ణీత కొలతలను నిర్ణయించారు. ఆ మేరకు బస్టాండ్‌ వెనక వైపునకు పెడస్ట్రియన్‌ జోన్‌గా కేటాయించాలి. నగరంలో వివిధ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ఎంట్రన్స్‌లకు వెళ్లేవిధంగా ఫుట్‌పాత్‌లను ముక్కలు, ముక్కలుగా నిర్మిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాదచారులు ప్రతీసారి ఎక్కి దిగి రావడం వల్ల ఫుట్‌పాత్‌లను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించరు. ఇందుకు ప్రత్యామ్నాయంగా పెడస్ట్రియన్ లెవల్‌ను తగ్గించి ఏర్పాటు చేయొచ్చు. గ్రేటర్‌లో ఒక కిలోమీటర్‌ దూరం కూడా నేరుగా నడిచి వెళ్లేలా ఫుట్‌పాత్‌లు లేవు.

ఫుట్‌పాత్‌లపై బైక్‌లు, కార్లు పార్కింగ్‌ చేసి ఉండటం సిటీలో నిత్యం కనిపించే దృశ్యాలు. అలా జరగకుండా ఫుట్‌పాత్‌, రోడ్‌కు మధ్య పార్కింగ్‌ కోసం కొంత స్థలం కేటాయించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అటు ట్రాఫిక్‌ జామ్ కాకుండా, ఇటు పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చూడొచ్చు. వ్యాపార సముదాయాల వద్ద జీబ్రా క్రాసింగ్‌ లెవల్‌ను కొంత ఎత్తు పెంచడం ద్వారా వాహనాల వేగాన్ని తగ్గించొచ్చని ఐఆర్‌సీ సూచించింది. ఐఆర్‌సీ నిబంధనలు పాటించి పెడస్ట్రియన్‌ జోన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడమేగాక పాదచారుల మరణాలను నిరోధించొచ్చు.

ఐఆర్‌సీ నిబంధనల ప్రకారం..
జోన్‌ పెడస్ట్రియన్‌ జోన్‌(కనీసం)
రెసిడెన్షియల్‌ 5 ఫీట్లు
కమర్షియల్‌ 8 ఫీట్లు
హై-కమర్షియల్‌ 10 ఫీట్లు

Tags: Footpath, Ghmc, Hyderabad, Pedastrian, IRC



Next Story

Most Viewed