కరెంట్ ‘కట్‌’కట షురూ!

by  |
కరెంట్ ‘కట్‌’కట షురూ!
X

హైదరాబాద్… సమైక్యాంధ్రప్రదేశ్‌లో కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోతే వార్త. ఇవీ ఎవరో మామూలు లీడర్ అన్నమాటలు కాదు.. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తరచూ చెప్పే మాటలు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ గొప్పగా చెబుతుంటారు. ఈ మాటలకు తగ్గట్టుగానే ప్రస్తుతం తెలంగాణలో పవర్ కట్లు ఉన్నట్లు ఏ అఫీషియల్ డేటాలోనూ ప్రభుత్వం చూపదు. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రవాహ్ వెబ్ సైట్‌లోనూ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నట్లు ఉండదు. అయితే ఈ వెబ్‌సైట్‌కు డేటా ఇచ్చేది రాష్ట్ర విద్యుత్ సంస్థలే కావడం గమనించదగ్గ అంశం. కానీ, రాష్ట్రంలో కరెంటు మాత్రం ఒక్కరోజులో చాలాప్రాంతాల్లో గంటకుపైగా కోతకు గురవుతోంది. దీన్ని అధికారికంగా కరెంటుకోత అని అనరు కాబట్టి తెలంగాణలో కరెంటు పోయిందన్న వార్త రాదు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఏకకాలంలో చాలా చోట్ల కరెంటు గంటల తరబడి కట్ అవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని దక్షిణ డిస్కం టీఎస్పీడీసీఎల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు వెల్లడిస్తోంది. అయితే ఈ కరెంటు కోతలకు కారణం కరెంటు సరిపడాలేక కాదని, సప్లై ఇబ్బందుల వల్లేనని ఆ సంస్థ చెబుతోంది.

రాష్ట్రంలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే కరెంటు డిమాండ్ గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 2 వేల మెగావాట్లు అధికంగా నమోదై 11 వేల మెగావాట్లకు చేరుతోంది. తెలంగాణ ట్రాన్స్‌ కో వెబ్‌సైట్ పవర్ సప్లై పొజిషన్ డేటా ఆదివారం పీక్ డిమాండ్ 11,700 మెగావాట్లుగా నమోదైంది. ఇదే తేదీ అంటే ఫిబ్రవరి 16న కేవలం 8962 మెగావాట్ల డిమాండ్ మాత్రమే నమోదైంది. ఓ పక్క రాష్ట్రంలో ఈ రబీ సీజన్‌లో రికార్డుస్థాయిలో పంటలు సాగవుతుండడం మరోపక్క ఎండాకాలం ముందే స్టార్ట్ అవడం వల్ల గృహ వినియోగం పెరిగి డిమాండ్ ఎక్కువ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం మార్చి ముగిసేసరికి రాష్ట్రంలో మొత్తం డిమాండ్ 13 వేల మెగావాట్లకు చేరొచ్చని ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే సమారు 40 శాతం అధికమన్నమాట. ప్రస్తుతం ఫిబ్రవరిలో పెరిగిన డిమాండ్‌కే సప్లై ఇబ్బందుల పేరిట అన్‌అఫీషియల్ కోతలు విధిస్తున్న తెలంగాణ విద్యుత్ శాఖ ముందు ముందు డిమాండ్ 13 వేల మెగావాట్లకు చేరితే ఏం చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు పెరిగిన డిమాండ్‌కే రాష్ట్ర డిస్కంలు స్పాట్ మార్కెట్లో రోజుకు 1,000 మెగావాట్లపైగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్‌లో ప్రస్తుతం విద్యుత్ అందుబాటులో ఉంది కాబట్టి సమస్యేమీ రావట్లేదు కానీ సమ్మర్ పీక్‌కు చేరాక ఎక్స్చేంజ్‌లో విద్యుత్ కావల్సినంత అందుబాటులో లేకపోతే పరిస్థితి అధికారిక కోతలవైపునకు వెళ్లొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 16న 232 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇందులో 127 మిలియన్ యూనిట్లు స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా బయటి విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నదే కావడం గమనార్హం. సింగరేణి విద్యుత్ కేంద్రం ఇస్తున్న 23 మిలియన్ యూనిట్లు కాక టీఎస్ జెన్‌కో విద్యుత్ కేంద్రాలు సరఫరా చేస్తున్నది కేవలం 52 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమేనని ట్రాన్స్‌కో వెబ్‌సైట్‌లోని గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Next Story