‘ఖాదీ’ భూముల గోల్‌మాల్.. సీక్రెట్ విక్రయం వెనుక ఆంతర్యమేంటీ..?

by  |
‘ఖాదీ’ భూముల గోల్‌మాల్.. సీక్రెట్ విక్రయం వెనుక ఆంతర్యమేంటీ..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మెట్‌పల్లి ఖాదీ భండార్ పరిధిలోని పూడురు భూముల అమ్మకం విషయంలో కమిటీ అత్యుత్సాహం ప్రదర్శించిందా..? తీర్మాణాలు ఉన్నా ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకోలేకపోయిందా..? గప్‌చుప్‌గా భూములను అమ్మడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే ఇప్పుడు అసలైన చర్చ..

ఆర్థికంగా దివాళా తీసినట్టయితే కమిటీ చేసిన తీర్మాణం కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి అమ్ముకునే హక్కు ఉంది. కానీ, ఈ ప్రాపర్టీని విక్రయించాలంటే బహిరంగ వేలం ప్రకటన ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఓపెన్ యాక్షన్ పెట్టడం వల్ల మార్కెట్లో ఈ ప్రాపర్టీకి విలువ మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల సంస్థకు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాల హైవేను ఆనుకున్న ఈ స్థలానికి ఇప్పటికే డిమాండ్ తీవ్రంగా ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం, జేఎన్‌టీయూలకు వెళ్లాలంటే పూడూరు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రానున్న కాలంలో ఈ భూముల ధరలు మరింత రెట్టింపు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ, సీక్రెట్‌గా విక్రయించడం వెనుక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. నిబంధనల ప్రకారం తీర్మాణం చేశామని చెప్తున్న పాలకవర్గం ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మాలన్న రూల్స్‌ను అతిక్రమించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

తికమక ప్రకటనలు..

పూడురులోని ఖాదీ భండార్ స్థలం అమ్మిన విషయంలో అంతా అయోమయమైన ప్రకటనలు చేస్తున్నారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 2020లోనే ఈ భూమిని విక్రయించాలని అప్పటి కమిటీ తీర్మాణం చేసిందని ప్రస్థుత చైర్మన్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రకటించారు. అయితే, 03 డిసెంబర్ 2014లోనే తీర్మాణం జరిగినట్టు మెట్‌పల్లి ఖాదీ భండార్‌కు సంబందించిన తీర్మాణం కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపున ఇదే విషయంపై టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ.4 లక్షలకు గుంట చొప్పున రూ.2.28 కోట్లకు భూమిని విక్రయించినట్టు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం రూ. 1కోటి 25 లక్షలకు కొన్నట్టుగా పేర్కొన్నారు. ఈ లెక్కన మిగతా సొమ్ము ఏం చేశారన్నదే మిస్టరీగా మారింది. ఒక వేళ ఖాదీ ప్రతిష్టాన్ ఖాతాలో రిజిస్ట్రేషన్ వాల్యూవేషన్ పోను మిగతా నగదును జమ చేశారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. ఒకవేళ సంస్థ అకౌంట్లో జమ చేసినా రిజిస్ట్రేషన్ వాల్యూవేషన్‌కు మించి ఎక్కువ డబ్బు పెట్టి కొన్నా ఆ వివరాలను సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే చూపించి, అందుకు తగిన రిజిస్ట్రేషన్ ఫీజును అధికారికంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం 1కోటి 25 లక్షలకే కొన్నామని వివరించినప్పుడు వీరు ప్రభుత్వాన్ని మిస్ గైడ్ చేసినట్టేనని, రిజిస్ట్రేషన్ ఫీ విషయంలో కూడా ఆదాయానికి గండి పెట్టారని పరోక్షంగా ఒప్పుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో నడుస్తున్న ఓ సంస్థకు చెందిన ప్రాపర్టీని అమ్మే విషయంలో రిజిస్ట్రేషన్ వాల్యూయేషన్ ప్రకారం కొని అదనపు డబ్బును సంస్థ అకౌంట్లో జమ చేసుకున్నా కూడా నేరమేనని అంటున్నారు.

వేలం వేసి ఉంటే..?

వాస్తవంగా ఇప్పుడు పూడురులో హైవే పక్కన ఉన్న రోడ్ సైడ్ ప్లాట్లకు రూ.25 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఆ తరువాత భూమి ధర కొంత తగ్గినా.. ఇప్పుడు విక్రయించినా భూమి ధరకు ఓపెన్ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలకు చాలా తేడా కనిపిస్తోంది. యాక్షన్ ద్వారా అమ్మినట్టయితే సంస్థకు మరింత ఆదాయం వచ్చి ఆర్థిక పరిపుష్టికి దోహదపడే అవకాశం ఉండేది కదా అన్నదే అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.

ఆస్థులెక్కడెక్కడో..?

మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్ సంస్థకు ఆస్థులు కేవలం మెట్‌పల్లి, పూడూరే కాకుండా తెలంగాణాలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రాపర్టీని విక్రయించారా లేక సంస్థ ఆధీనంలోనే ఉన్నాయా అన్నది తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-మేడిపల్లి సత్యం, చొప్పదండి కాంగ్రెస్ ఇంఛార్జి



Next Story

Most Viewed