ఆలోచించి అవకాశం ఇవ్వండి

by Sridhar Babu |
ఆలోచించి అవకాశం ఇవ్వండి
X

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, కుట్రలు, మోసలు చేసే వారిని తరిమికొట్టాలని మెదక్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని, అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇంత త్వరగా ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ కే దక్కిందని అన్నారు. ఆ పార్టీ ఢిల్లీ రిమోట్ తో నడుస్తుందని ఎద్దేవా చేశారు. జిల్లాలో కలెక్టర్ గా చేసిన అనుభవంతో సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

వెంకట్రామిరెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు విద్య అందిస్తానని, సీనియర్ ఐఏఎస్ ల తో కోచింగ్ ఇప్పించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తానని తెలిపారు. పేదల ఇంట్లో పెళ్లికి ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ అందిస్తామని అన్నారు. కల్యాణ మండపాలను తొమ్మిది నెలల్లో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. యువతకు శిక్షణ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ మెలుకువలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పది లక్షల ప్రమాద బీమా సౌకరం కల్పిస్తామని వివరించారు. సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు ఉన్న ఆస్తిలో కొంత భాగం ట్రస్ట్ కోసం వెచ్చింది నియోజకవర్గంలో సేవ చేస్తానని తెలిపారు. సేవ చేసే వారు కావాలో, మోసం చేసే వారు కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లికార్జున్, జగపతి, సోము తదితరులు ఉన్నారు.

Next Story