వ్యాక్సినేషన్ కోసం అంతా సిద్ధం

by  |
వ్యాక్సినేషన్ కోసం అంతా సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు దాదాపు ముగిశాయి. ఉన్నతాధికారులు అన్ని జిల్లాల వైద్యాధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం మొత్తం మీద 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున తొలి రోజు మొత్తం 13,900 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. తొలి రోజున ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలువురితో మాట్లాడనున్నారు. తెలంగాణలో గాంధీ ఆసుపత్రి, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనివారితో సంభాషించనున్నారు.

ప్రైవేటులో ఏర్పాటు చేసిన 40 కేంద్రాలలో ఎనిమిది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, ఆరు హైదరాబాద్ జిల్లాలో, ఐదు రంగారెడ్డి జిల్లాలో, నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో నాలుగు చొప్పున ఉన్నాయి. 13 జిల్లాల ప్రైవేటు ఆసుపత్రులలోనే వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే వ్యాక్సినేషన్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అపోలో, యశోదా, కిమ్స్, కామినేని లాంటి ఆసుపత్రులలో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గాంధీ, ఉస్మానియా, ఛెస్ట్, గచ్చిబౌలి టిమ్స్ లాంటి ప్రభుత్వాసుపత్రులలోనూ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తారు. ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది. హెల్త్ కేర్ సిబ్బంది విధులలో ఉంటున్నందున అందరూ హాజరుకావడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ ప్రక్రియ పూర్తికావడానికి నాలుగైదు రోజుల సమయం పట్టేలా ఉంది.

హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఆ తర్వాతి క్రమంలో పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికులకు కూడా ఇవ్వనున్నందున మొత్తం తొమ్మిది లక్షల మందికి తొలి డోస్ ఇవ్వడానికి సుమారు రెండు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాల అంచనా. హెల్త్ కేర్ సిబ్బంది వివరాలన్నీ ‘కొవిన్’లో నమోదై సిద్ధంగా ఉన్నా పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికుల వివరాలు మాత్రం ఇంకా నమోదు చేసే స్థాయిలోనే ఉన్నాయి. హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వీరి పేర్లు కూడా ‘కొవిన్’లోకి చేరితే వారికి కూడా పంపిణీ మొదలవుతుంది.

నేడే రాష్ట్రానికి డోస్‌లు

రాష్ట్రానికి సుమారు ఆరున్నర లక్షల మేర డోస్‌లు సోమవారం చేరుకోనున్నాయని వైద్యారోగ్య శాఖవర్గాల సమాచారం. తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వాల్సి ఉంది. సుమారు మూడు లక్షల మందికి రెండు విడతలలో రెండేసి చొప్పున డోస్‌లు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ఆరు లక్షల డోస్‌లు, అదనంగా 10.7% మేర అదనంగా మరో 50 వేల డోస్‌లు వస్తున్నాయి. హెల్త్ కేర్ వర్కర్లకు తొలి డోస్ ఇవ్వడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉన్నందున అప్పటికల్లా మరోసారి కొత్త స్టాక్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సిరంజీలు వచ్చి రెడీగా ఉన్నాయి. వ్యాక్సిన్‌లు వచ్చిన తర్వాత వాటిని నిల్వ చేయడానికి వీలుగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోల్డ్ స్టోరేజీ చైన్ సిస్టమ్ రెడీ అయింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిల్వ

హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్‌లు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది. డోస్‌లు భద్రపరిచిన చోట కూడా పోలీసు భద్రత కొనసాగనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్‌లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు.. ఇలా అన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటయ్యాయి.


Next Story

Most Viewed