ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ జైశ్వాల్ దూకుడు.. తొలిసారిగా ఆ జాబితాలోకి ఎంట్రీ

by Dishanational3 |
ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ జైశ్వాల్ దూకుడు.. తొలిసారిగా ఆ జాబితాలోకి ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ జోరు కనబరిచాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-15లోకి అడుగుపెట్టాడు. ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ 14 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ పొందాడు. 699 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. వరుసగా వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో జైశ్వాల్ డబుల్ సెంచరీలు సాధించడంతో అతని ర్యాంక్ మెరుగుపడింది. టాప్-15‌ టెస్టు బ్యాటర్లలో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ 7వ స్థానంలో ఉండగా.. రోహిత్ ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 12వ ర్యాంక్‌కు చేరకున్నాడు. రెండు స్థానాలు కోల్పోయిన పంత్ 14వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు, రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ చేసిన జడేజా 7 స్థానాలను వెనక్కినెట్టి 34వ ర్యాంక్‌కు చేరుకోగా.. శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు అధిగమించి 35వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతను 17 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి సెలెక్టర్లు నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 2వ ర్యాంక్‌కు చేరుకోగా.. జడేజా 3 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఒక్క స్థానం అధిగమించి 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Next Story