పారిస్ ఒలింపిక్స్‌కు వినేశ్, అన్షు, రీతిక అర్హత

by Dishanational3 |
పారిస్ ఒలింపిక్స్‌కు వినేశ్, అన్షు, రీతిక అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : కిర్గిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళా రెజర్లు అదరగొట్టారు. వినేశ్ ఫొగట్(50 కేజీలు), అన్షు మాలిక్(57 కేజీలు), రీతిక హుడా(76 కేజీలు) తమ విభాగాల్లో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. సెమీస్‌లో గెలుపొందడంతో వీరు ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. సెమీస్ బౌట్లలో వినేశ్ 10-0 తేడాతో లారా గానికిజీని(కజకిస్తాన్‌)ను మట్టికరిపించగా.. అన్షు 11-0 తేడాతో లైలోఖాన్ సోబిరావా(ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. అండర్-23 వరల్డ్ చాంపియన్ రీతిక హుడా 7-0 తేడాతో చాంగ్ హుయ్‌(చైనా)ను ఓడించి ఈ టోర్నీలో భారత్‌కు మూడో ఒలింపిక్ కోటాను అందించింది. 62 కేజీల కేటగిరీలో మాన్సి పరాజయం పాలవ్వగా.. 68 కేజీల కేటగిరీలో నిశా దహియా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. రెజ్లింగ్‌లో భారత్ ఒలింపిక్ కోటా స్థానాల సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అంతిమ్ పంఘల్(53 కేజీలు) బెర్త్ సాధించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed