ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ అమలు చేయబోతున్న బీసీసీఐ!

by Dishanational3 |
ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ అమలు చేయబోతున్న బీసీసీఐ!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ప్రారంభం నుంచి గత సీజన్ వరకు టోర్నీ అభివృద్ధి కోసం బీసీసీఐ లీగ్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రతి సీజన్‌లో అంపైర్ల తప్పిదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంతేకాకుండా, కొన్నిసార్లు రనౌట్, స్టంప్ ఔట్, ఎల్బీడబ్ల్యూ, బౌండరీ వద్ద క్యాచ్‌లు వంటి సందర్భాల్లో కెమెరా యాంగిల్ సరిగా కనిపించకపోవడంతో అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే, చాలా సమయం వృథా అవుతుంది. దీనిపై ఫోకస్ పెట్టిన బోర్డు వాటికి చెక్ పెట్టేలా కొత్త టెక్నాలజీని తీసుకరానున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్-2024‌లో ‘స్మార్ట్ రీప్లే సిస్టమ్‌’ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా అంపైర్ల తప్పిదాలకు చెక్ పెట్టడమే కాకుండా వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ పద్ధతి అమలుపై బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

స్మార్ట్ రీప్లే సిస్టమ్ అంటే?

ఈ టెక్నాలజీని ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చెందిన ‘ది హండ్రెండ్’ లీగ్‌లో ఉపయోగించారు. దీన్ని ఐపీఎల్‌లో అమలు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ పద్ధతిపై బోర్డు రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించింది. సుమారు 15 మంది అంపైర్లు ఇందులో భాగమయ్యారు. గతంలో టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్స్ వేరే గదుల్లో ఉండేవారు. మధ్యవర్తిగా టీవీ బ్రాడ్‌ కాస్ట్ డైరెక్టర్ ఉండేవాడు. రివ్యూ సమయంలో టీవీ బ్రాడ్‌కాస్ట్ డైరెక్టర్ హాక్ ఐ ఆపరేటర్ల నుంచి సమాచారాన్ని థర్డ్ అంపైర్‌కు అందించేవాడు. అయితే, స్మార్ట్ రీప్లే సిస్టమ్ ప్రకారం.. టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్లు ఒకే గదిలో ఉంటారు. మైదానంలో ఉండే 8 హైస్పీడ్ హాక్ ఐ కెమెరాల నుంచి థర్డ్ అంపైర్ కెమెరాల నుంచి బ్రాడ్‌కాస్ట్ డైరెక్టర్‌తో సంబంధం లేకుండా రీప్లేలను పరిశీలించొచ్చు. దీనిద్వారా వేగంగా నిర్ణయం తీసుకునే వీలు ఉంటుంది. అంతేకాకుండా, ఈ సిస్టమ్ ద్వారా స్ప్లిట్ స్కీన్ ఇమేజెస్, అత్యంత స్పష్టంగా ఉండే విజువల్స్ అంపైర్‌ చూడొచ్చు. ఫలితంగా వేగంగా, కచ్చితత్వంతో కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.


Next Story