ఆడమ్ జంపా, రాబిన్ మింజ్‌ స్థానాలను భర్తీ చేసిన రాజస్థాన్, గుజరాత్.. ఎవరిని తీసుకున్నాయో తెలుసా?

by Dishanational3 |
ఆడమ్ జంపా, రాబిన్ మింజ్‌ స్థానాలను భర్తీ చేసిన రాజస్థాన్, గుజరాత్.. ఎవరిని తీసుకున్నాయో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024కు దూరమైన తమ ఆటగాళ్ల స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం రిప్లేస్‌మెంట్లను ప్రకటించాయి. ఇటీవల బైక్ యాక్సిడెంట్‌లో గుజరాత్ వికెట్ కీపర్ రాబిన్ మింజ్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. దీంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వగా.. అతని స్థానాన్ని గుజరాత్ జట్టు కర్ణాటక వికెట్ కీపర్ బి.ఆర్ శరత్‌తో భర్తీ చేసింది. అతన్ని కనీస ధర రూ. 20 లక్షలకు జట్టులోకి తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక తరపున శరత్ 28 టీ20ల్లో 328 పరుగులు చేశాడు. ఈ నెల 24న ముంబైతో గుజరాత్ తలపడనుంది.

మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానంలో రాజస్థాన్ జట్టు ముంబై ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. ఇటీవల రంజీ ట్రోఫీలో తనుష్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో సత్తాచాటాడు. ముంబై 42వ సారి ట్రోఫీ గెలవడంలో అతనిది కీలక పాత్ర. రాజస్థాన్‌ అతని కోసం కనీస ధర రూ.20 లక్షలు వెచ్చించింది. ముంబై తరపున తనుష్ 23 టీ20లు, 26 ఫస్ట్ క్లాస్, 19 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ నెల 24న లక్నోతో రాజస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story