రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారిగా వార్మప్ మ్యాచ్ ఆడిన రిషబ్

by Dishanational3 |
రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారిగా వార్మప్ మ్యాచ్ ఆడిన రిషబ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి బ్యాటు పట్టుకున్నాడు.బెంగళూరు సమీపంలోని ఆలూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌‌లో పంత్ పాల్గొన్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత అతను మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. కుడి మోకాలికి సర్జరీ జరగడంతో అతను పరుగెత్తడంపై నెలకొన్న అనుమానాలను తాజాగా పటాపంచలు చేశాడు. వికెట్ల మధ్య చురుకుగా పరుగెత్తాడు. అలాగే, బ్యాటుతోనూ అలరించాడు. ఈ వీడియోను పంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ప్రస్తుతం పంత్ ఎన్‌సీఏలో పునరావసంలో ఉన్నాడు.ప్రమాదం కంటే ముందు నాటి ఫిట్‌నెస్‌ను పంత్ సాధించినట్టు తెలుస్తోంది. ‘నెట్స్‌లో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, అతను స్వేచ్ఛగా కదులుతున్నాడా?లేదా? అని నిర్దారించుకోవడానికే ఈ వార్మప్ మ్యాచ్.’ అని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ నాటికి మైదానంలో అడుగుపెట్టడమే లక్ష్యంగా అతను సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పంత్ ఐపీఎల్-17 సీజన్‌లో పాల్గొంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పంత్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. కీపింగ్ బాధ్యతలు వేరే ఆటగాడికి అప్పగిస్తారని సమాచారం. మరోవైపు, పంత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. కాగా, గత సీజన్‌లో పంత్ గైర్హాజరులో ఢిల్లీ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించిన విషయం తెలిసిందే.


Next Story