భారత పారాలింపిక్స్ కమిటీపై సస్పెన్షన్ వేటు

by Dishanational3 |
భారత పారాలింపిక్స్ కమిటీపై సస్పెన్షన్ వేటు
X

దిశ, స్పోర్ట్స్ : సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన భారత పారాలింపిక్ కమిటీ(పీసీఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటు వేసింది. మంగళవారం కమిటీని సస్పెండ్ చేసింది. పీసీఐ తన సొంత రాజ్యాంగం నిబంధలనకు విరుద్ధంగా ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ‘2020లో ఎన్నికైన పీసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ నాలుగేళ్ల పదవీకాలం జనవరి 31తో ముగిసింది. పదవీకాలం ముగియకముందే పీసీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, అలా జరగలేదు. మార్చి 28న ఎన్నికలు నిర్వహించనున్నట్టు జనవరి 22న పీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం పాత ఎగ్జిక్యూటివీ కమిటీ పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఇది పీసీఐ సొంత రాజ్యాంగంలోని నిబంధనలతోపాటు స్పోర్ట్స్ కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుంది.’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అలాగే, మార్చి 28న ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి సరైన కారణం లేదని, అది ఉద్దేశపూర్వంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పీసీఐని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, పీసీఐ రోజువారి కార్యకలాపాల పర్యవేక్షణకు అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా‌ను ఆదేశించింది. ఈ కమిటీ పీసీఐ రాజ్యాంగం, స్పోర్ట్స్ కోడ్‌కు లోబడి ఎన్నికలు నిర్వహిస్తుందని తెలిపింది.

Next Story

Most Viewed