పాక్ ఆశలు చిదిమేసిన మిచెల్, ఫిలిప్స్

by Harish |
పాక్ ఆశలు చిదిమేసిన మిచెల్, ఫిలిప్స్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ చెలరేగి ఆడుతోంది. వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న కివీస్.. నాలుగో టీ20లోనూ పాక్‌ను ఓడించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో తేడాతో ఆతిథ్య జట్టు గెలుపొందింది. డారెల్ మిచెల్(72 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్(70) బ్యాటు ఝుళిపించడంతో పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని కివీస్ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సైమ్ అయూబ్(1), బాబర్ ఆజామ్(19), ఫకర్ జమాన్(9) నిరాశపర్చిన వేళ ఓపెనర్ రిజ్వాన్(90 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకూ నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. మహ్మద్ నవాజ్(21 నాటౌట్) ఆఖర్లో మూడు సిక్స్‌లతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన కివీస్‌ను పాక్ కెప్టెన్, పేసర్ షాహీన్ అఫ్రిది భారీ దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లు పిన్ అలెన్(8), టిమ్ సీఫెర్ట్(0)లతోపాటు విల్ యంగ్(4)ను అవుట్ చేశాడు. దీంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. దీంతో పాక్ మ్యాచ్‌నూ తమ వైపు తిప్పుకునేలా కనిపించింది. అయితే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మెరుపు హాఫ్ సెంచరీలతో పాక్‌కు షాకిచ్చారు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిన వీరు 4వ వికెట్‌కు 139 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 159 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 18.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇక, సిరీస్‌లో ఆఖరి టీ20 ఆదివారం ఇదే వేదికపై జరగనుంది.

Next Story