Ranji Trophy Final : పట్టు బిగించిన ముంబై

by Dishanational3 |
Ranji Trophy Final : పట్టు బిగించిన ముంబై
X

దిశ, స్పోర్ట్స్ : విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌పై ముంబై జట్టు పట్టు బిగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తున్న ఆ జట్టు సోమవారం ఆట ముగిసే సమయానికి 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 31/3తో రెండో రోజు ఆట కొనసాగించిన విదర్భ 105 పరుగులకే ఆలౌటైంది. యశ్ రాథోడ్(27) టాప్ స్కోరర్. ముంబై బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 74 పరుగుల మాత్రమే జోడించిన విదర్భ తొలి సెషన్‌లోనే మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. ముంబై బౌలర్లలో తనూష్(3/7), కులకర్ణి(3/15), షామ్స్ ములానీ(3/32) మూడేసి వికెట్లతో రాణించి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబైకి 119 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ముంబైకి మొదట శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు పృథ్వీషా(11), భూపెన్ లాల్వానీ(18) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. అనంతరం కెప్టెన్ అజింక్యా రహానే(58 బ్యాటింగ్), ముషీర్ ఖాన్(51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. క్రీజులో పాతుకపోయిన ఈ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జోడించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్లను కోల్పోయి 141 పరుగులు చేసింది.



Next Story

Most Viewed