టెస్టులు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ బంఫర్ ఆఫర్?.. ఆ దిశగా బోర్డు కసరత్తు

by Dishanational3 |
టెస్టులు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ బంఫర్ ఆఫర్?.. ఆ దిశగా బోర్డు కసరత్తు
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా టెస్టులకు ఆదరణ తగ్గుతోంది. టీ20 లీగ్‌ల రాకతో రెడ్ బాల్ క్రికెట్ పూర్వ వైభవాన్ని క్రమంగా కోల్పోతుంది. ఆటగాళ్లు సైతం టెస్టులు ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌‌ను ప్రోత్సహించేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టనుందా?.. ఆ దిశగా అడుగులు వేస్తుందా? అంటే సంబంధిత వర్గాల నుంచే అవుననే సమాధానమే వస్తోంది.

వరల్డ్ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే బీసీసీఐ టెస్టులకు తిరిగి పూర్వ వైభవం తీసుకరావడానికి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.ఇటీవల టీమ్ ఇండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసం రంజీ ట్రోఫీలకు దూరంగా ఉన్నట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ ఆటగాళ్లను సుదీర్ఘ ఫార్మాట్‌కు దగ్గర చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు బీసీసీఐ టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షల మ్యాచ్ ఫీజును చెల్లిస్తుంది. వన్డేల్లో రూ. 6 లక్షలు, టీ20ల్లో రూ. 3 లక్షలు ఇస్తుంది. కొత్త రెమ్యునరేషన్ మోడల్‌పై బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్ ఫీజులను పెంచాలని ఆలోస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఒక ఏడాదిలో ఎక్కువ టెస్టు సిరీస్‌లు ఆడిన ఆటగాళ్లకు అదనంగా రివార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్‌కు ఇవి అదనం. ఈ నిర్ణయం ఆటగాళ్లను రెడ్ బాల్ క్రికెట్‌ ఆడేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని బోర్డు భావిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత కొత్త రెమ్యునరేషన్ మోడల్‌ను ఆమోదించి అమల్లోకి తీసుకరావడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది.


Next Story