అశ్విన్‌కు బదులు అతన్ని తీసుకుంటే బెటర్.. ఇర్ఫాన్ ఏం చెప్పాడంటే..

by Dishanational5 |
అశ్విన్‌కు బదులు అతన్ని తీసుకుంటే బెటర్.. ఇర్ఫాన్ ఏం చెప్పాడంటే..
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు భావిస్తున్నది. ఈ నెల త్రీ నుంచి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక సూచన చేశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో ఇర్ఫాన్ పటాన్ మాట్లాడుతూ..‘జడేజా ఫిట్‌గా ఉంటే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలి. సెంచూరియన్ పిచ్‌పై అశ్విన్ జట్టు ఆశించిన దానికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ, మేము 7వ స్థానంలో జడేజా బ్యాటింగ్‌ను మిస్ అయ్యాం.’అని తెలిపాడు. అలాగే, ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకోవడంపై ఆలోచించాలన్నాడు. ‘రోహిత్ అదే బౌలింగ్ దళంతో ఆడినా పర్వాలేదు. కానీ, మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకోవాలి. కానీ, ప్రసిద్ధ్‌పై మీకు నమ్మకముంటే రెండో టెస్టులో అతనికి మద్దతుగా నిలవండి.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, తొలి టెస్టులో మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా బుమ్రా, అశ్విన్ మాత్రమే పరుగులను కట్టడి చేశారు. 19 ఓవర్లు వేసిన అశ్విన్ 41 పరుగులే ఇచ్చాడు. కానీ, ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బ్యాటుతో మాత్రం అతను ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులే చేసి అవుటవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. జడేజా బ్యాటింగ్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండో టెస్టులో అతన్ని తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ బలం పెరుగుతుంది.


Next Story