ఆ మూడు జట్లది ఒక్కో కథ

by Dishanational3 |
ఆ మూడు జట్లది ఒక్కో కథ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుంది. మరో రెండు రోజుల్లో లీగ్ ప్రారంభకానుంది. టైటిలే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. అందులో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లపై మాత్రం అభిమానులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఇప్పటికే చెరోసారి, కోల్‌కతా రెండుసార్లు చాంపియన్లుగా నిలిచాయి. అయితే, ఆ జట్లు టైటిల్ గెలిచి ఏళ్లు గడిచిపోయాయి. మరో టైటిల్ కోసం పలు సీజన్లుగా పోరాడుతున్నా నిరాశే ఎదురువుతున్నది. మరి, ఆ మూడు జట్లు ఐపీఎల్-2024లో ఏ మేరకు సత్తాచాటుతాయో చూడాలి.

కమిన్స్.. ఎస్‌ఆర్‌హెచ్ రాత మార్చేనా?

డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత జట్టు మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. సైలెంట్‌గా ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చే జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పేరు ఉండేది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్లను మార్చినా ఆ జట్టు ప్రదర్శన మారలేదు. గత మూడు సీజన్లలో 8వ స్థానంతోనే సరిపెట్టింది. ఈ సారి కూడా కొత్త కెప్లెన్ సారథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్ నడిపించబోతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ అంటే బలమైన బౌలింగ్ దళానికి పేరు. కమిన్స్ రాకత బౌలింగ్ బలం మరింత మెరుగుపడిందనే చెప్పొచ్చు. భువనేశ్వర్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్‌, నటరాజన్‌‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. అలాగే, వేలంలో కొనుగోలు చేసిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు, వేలంలో ట్రావిస్ హెడ్‌ను తీసుకుని బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచుకుంది. హెడ్‌తోపాట మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌, క్లాసెన్‌లతో బ్యాటింగ్ దళం పేపర్‌పై బలంగా ఉంది. కమిన్స్, వాషింగ్టన్ సుందర్, హసరంగ వంటి ఆల్‌రౌండర్లు బ్యాటుతోనూ సత్తాచాటేవాళ్లే. అయితే, జట్టులో విదేశీ ప్లేయర్లుగా ఎక్కువగా ఉండటంతో కూర్పు సమస్యగా మారనుంది. అలాగే, జట్టులోని భారత ప్లేయర్లు ఇటీవల ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. జట్టుపై ఆ ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ నెల 23న కోల్‌కతాతో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.

మూడో కప్పుపై కేకేఆర్ ఫోకస్

ఐపీఎల్‌లో ముంబై, చెన్నయ్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచినట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత సీజన్లలో జట్టు మంచి ప్రదర్శన చేసిన ఫైనల్‌ వరకూ చేరుకోలేకపోయింది. 2021లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరినా చెన్నయ్ చేతిలో ఓటమిపాలైంది. ఇక, గత రెండు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ సీజన్‌లో మూడో కప్పు నిరీక్షణకు తెరదించాలని కేకేఆర్ భావిస్తున్నది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు బలమనే చెప్పొచ్చు. అలాగే, వేలంలో భారీ ధర రూ. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పేసర్ మిచెల్ స్టార్క్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. స్టార్క్, ముజీబ్ రెహ్మాన్ రాకతోపాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లతో దళం బలంగా ఉంది. జట్టులో బ్యాటర్లకు కొదవలేదనే చెప్పొచ్చు. గుర్బాజ్, ఫిల్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా‌, రింకు సింగ్‌, రస్సెల్, సునీల్ నరైన్ వరకు బ్యాటుతో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు ఉన్నారు. మొత్తంగా ఈ సారి కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఈ నెల 23న హైదరాబాద్‌తో పోరుతో కేకేఆర్ టోర్నీని ఆరంభించనుంది.

శాంసన్.. ఈ సారైనా?

రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ ఆరంభ సీజన్-2008 విజేత. ఆ తర్వాత ఆ జట్టుకు మరో టైటిల్ కలగానే మిగిలింది. 2022లో శాంసన్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరినా గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. శాంసన్ సారథ్యంలో ఇప్పటికీ మూడు సార్లు ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. అయినప్పటికీ మేనేజ్‌మెంట్ శాంసన్‌ కెప్టెన్సీపై నమ్మకంగా ఉంది. రాజస్థాన్‌కు భారీ బ్యాటింగ్ బలం ఉండటం కలిసొచ్చే అంశం. యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, హెట్మేయర్, పొవెల్, రియాన్ పరాగ్ వంటి హిట్టర్లను కలిగి ఉంది. జైశ్వాల్, జురెల్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నారు. బట్లర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శాంసన్ నిలకడలేమి ఆందోళన కలిగించే అంశమే. ఈ సీజన్‌లో అతను కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇక, అశ్విన్, యుజువేంద్ర చాహల్‌, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మలతో బౌలింగ్ దళం కూడా బాగుంది. గత సీజన్‌లో 5వ స్థానంతో సరిపెట్టిన రాజస్థాన్ ఈ సారి టైటిల్ సాధించాలనే పంతంతో బరిలోకి దిగుతున్నది. ఈ నెల 24న లక్నోతో రాజస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story

Most Viewed