దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు

by Dishanational3 |
దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ అవార్డు అందుకుంది. దీప్తి శర్మ గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకున్నట్టు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. సహచర క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్, జింబాబ్వేకు చెందిన ప్రీసియస్ మారాంజ్‌లను వెనక్కి నెట్టి దీప్తి ఈ అవార్డును సొంతం చేసుకుంది. డిసెంబర్‌లో దీప్తి బంతితో, బ్యాటుతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లు గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. రెండు టెస్టుల్లో 55 సగటుతో 165 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు తీసింది. ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా 9 వికెట్లతో సత్తాచాటింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ ఆమె ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం దీప్తికి ఇదే తొలిసారి. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న రెండో భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి నిలిచింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అవార్డు గెలుచుకున్నాడు.


Next Story