రాజ్‌కోట్ టెస్టుకు స్టార్ ఆటగాడు దూరం.. టీమ్ ఇండియా‌కు దెబ్బ మీద దెబ్బ

by Dishanational3 |
రాజ్‌కోట్ టెస్టుకు స్టార్ ఆటగాడు దూరం.. టీమ్ ఇండియా‌కు దెబ్బ మీద దెబ్బ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఒకవైపు ఫామ్ లేమి, మరో వైపు గాయాలు రోహిత్ సేనను వేధిస్తున్నాయి. తొలి టెస్టులో గాయపడి వైజాగ్ మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మిగతా మ్యాచ్‌లకు ఎంపికైన విషయం తెలిసిందే. వీరి రాకతో టీమ్ ఇండియా బలోపేతం అవుతుందని అంతా భావించారు. అంతలోనే మరో బ్యాడ్ న్యూస్. మూడో టెస్టుకు రాహుల్ దూరం కానున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అతను కోలుకోవడానికి ఇంకా వారం పడుతుందని మెడికల్ టీమ్ సెలెక్టర్లకు వెల్లడించినట్టు తెలుస్తోంది.

జడేజా, రాహుల్ ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేస్తేనే మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. జడేజా పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తోంది. రాహుల్ సైతం ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతను మూడో టెస్టు ఆడటం ఖాయమే అనిపించింది. అయితే, అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మెడికల్ టీమ్ సెలెక్టర్లకు తెలియజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు కేఎల్ రాహుల్‌‌ స్థానాన్ని సెలెక్టర్లు భర్తీ చేసే పనిలో పడ్డారు.

అయితే, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరులో రాహుల్ స్థానాన్ని భర్తీ చేయడం సెలెక్టర్లకు తలనొప్పిగా మారే విషయమే. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అతను మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, సెలెక్టర్లు యువకుల వైపు మొగ్గు చూపుతుండటంతో అతనికి నిరాశే ఎదురవుతున్నది. తొలి రెండు టెస్టులకు కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్, వైజాగ్ టెస్టు కోసం రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి, పుజారాకు అవకాశం దాదాపుగా లేనట్టే. ఈ క్రమంలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం అతను రాణిస్తున్నాడు. కర్ణాటక తరపున 4 మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార టెస్టు సిరీస్‌లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ బాదాడు. మరి, సెలెక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 15 నుంచి 19 వరకు మూడో టెస్టు జరగనుంది.

Next Story

Most Viewed