చివరి టెస్టు ఆడేసిన వార్నర్.. ఫేర్‌వెల్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు

by Dishanational5 |
చివరి టెస్టు ఆడేసిన వార్నర్.. ఫేర్‌వెల్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచే తనకు చివరిదని వార్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌తో వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆఖరి మ్యాచ్‌లోనూ వార్నర్ మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 75 బంతుల్లో 57 పరుగులు చేసి ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా పాక్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంలో వార్నర్‌ది కీలక పాత్ర. 6 ఇన్నింగ్స్‌ల్లో అతను 299 పరుగులతో ఆసిస్ తరపున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ అవుటై డ్రెస్సింగ్ రూంకు వెళ్తుండగా అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.ప్రేక్షకుల చప్పట్లతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ హోరెత్తింది. డ్రెస్సింగ్ రూంకు వెళ్తుండగా వార్నర్.. ఓ కుర్రాడికి తన హెల్మెట్, గ్లోవ్స్ అందించాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. ‘దాదాపు రెండేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ గొప్పగా ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విజయం, యాసెస్ సిరీస్ డ్రా, వన్డే వరల్డ్ కప్ గెలవడం.. ఇప్పుడు -0తో సిరీస్ సాధించడం.. అన్నీ అద్భుత విజయాలే. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నా ఆటతో అభిమానుల ముఖాలపై చిరునవ్వులు నింపానని అనుకుంటున్నా.’ అని తెలిపాడు. ఈ సందర్భంగా వార్నర్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. తన వెన్నంటే నిలిచిన భార్య కాండిస్‌కు థ్యాంక్యూ చెప్పాడు. కాగా, తన కెరీర్‌లో 112 టెస్టులు ఆడిన వార్నర్ 44.59 సగటుతో 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.



Next Story