ప్రో కబడ్డీ లీగ్: ఫైనల్‌కు చేరిన రెండు జట్లు ఇవే..

by Dishanational5 |
ప్రో కబడ్డీ లీగ్: ఫైనల్‌కు చేరిన రెండు జట్లు ఇవే..
X

దిశ, స్పోర్ట్స్: దాదాపు మూడు నెలలపాటు అలరించిన ‘ప్రో కబడ్డీ లీగ్’(పీకేఎల్) తుది దశకు చేరుకుంది. డిసెంబర్ 2 నుంచి 12 జట్ల మధ్య రసవత్తరంగా సాగిన ఈ పోరులో చివరికి రెండు జట్లు మిగిలాయి. హైదరాబాద్ వేదికగా బుధవారం జరిగిన సెమీస్‌లో హర్యానా స్టీలర్స్, పుణెరి పల్టాన్ జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాయి. పాట్నా పైరేట్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పుణెరి పల్టాన్ 37-21 తేడాతో ఘన విజయం సాధించింది. పుణెరి కెప్టెన్ అస్లామ్ ముస్తఫా, రైడర్ పంకజ్ ఏడేసి పాయింట్లు తీసుకురాగా, ఆల్‌రౌండర్ మహ్మద్‌రెజా 5పాయింట్లతో ఫరవాలేదనిపించాడు. ఇక, పాట్నా పైరేట్స్ జట్టులో రైడర్ సచిన్ ఒక్కడే ఐదు పాయింట్లు సాధించాడు. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక, ఇదే వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై హర్యానా స్టీలర్స్ అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసేసరికి హర్యానా 31 పాయింట్లు సాధించగా, జైపూర్ 27 పాయింట్లకే పరిమితమైంది. దీంతో నాలుగు పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకుంది. హర్యానా ప్లేయర్లలో రైడర్ వినయ్ 11 పాయింట్లతో రాణించగా, శివమ్ పటారే(7), ఆశిష్(4) ఫరవాలేదనిపించారు. జైపూర్ ఆటగాళ్లలో రైడర్ అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లతో అదగొట్టినప్పటికీ, మిగతా జట్టు సభ్యులు అంతగా రాణించలేదు. దీంతో సెమీస్‌లో జైపూర్ ఓటమి పాలైంది. హైదరాబాద్ వేదికగానే పుణెరి, హర్యానా జట్ల మధ్య శుక్రవారం రాత్రి 8గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.



Next Story