పులి తిరిగొచ్చింది: పంత్‌కు డీసీ గ్రాండ్ వెల్కమ్.. పంత్ ఏమన్నాడంటే..?

by Dishanational5 |
పులి తిరిగొచ్చింది: పంత్‌కు డీసీ గ్రాండ్ వెల్కమ్.. పంత్ ఏమన్నాడంటే..?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనం ఖరారైంది. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన పంత్.. పూర్తిగా కోలుకున్నాడు. బ్యాటింగ్‌తోపాటు వికెట్ కీపింగ్ కూడా చేయడానికి పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని బీసీసీఐ మంగళవారమే వెల్లడించిన విషయం తెలిసిందే. 14 నెలల సుదీర్ఘకాలం ఆటకు దూరమైన పంత్.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు తరఫున అలరించనున్నాడు. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సైతం చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ వేదికగా పంత్‌కు అదిరిపోయేలా స్వాగతం పలికింది. బ్యాటు పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగుతున్నట్టున్న ఫొటోను షేర్ చేసింది. ఫొటోలో పంత్ బ్యాక్‌గ్రౌండ్‌లో వేట కోసం చూస్తున్నట్టున్న పులిని ఉంచి.. ‘టైగర్ రిటర్న్స్’ అనే టెక్స్ట్‌ను యాడ్ చేసింది. ఈ ఫొటోకు ‘‘పులి తిరిగొస్తోంది. గర్జించేందుకు సిద్ధంగా ఉంది’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. అలాగే, మరో ప్రత్యేక వీడియోను సైతం తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో ఓ బాలుడు పంత్‌కు ఓ గిఫ్ట్ బాక్స్ ఇవ్వగా, అందులో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ ఉంటుంది. దాన్ని వేసుకున్న పంత్.. ‘‘నేను సిద్ధంగా ఉన్నాను. కలిసి గర్జిద్దాం’’ అని చెబుతాడు. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో పంత్ వాయిస్ ఓవర్ ఉంటుంది.

‘ఉత్సాహంగా ఉన్నా’

క్రికెట్‌లోకి తన రీ-ఎంట్రీపై పంత్ తాజాగా స్పందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్రత్యేక వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో పంత్ మాట్లాడుతూ, ‘‘సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇదే సమయంలో కొంత ఆందోళనగానూ ఉంది. క్రికెట్‌లోకి కొత్తగా అరంగేట్రం చేస్తున్నానన్న భావన కలుగుతోంది. తీవ్రగాయాల నుంచి కోలుకుని మళ్లీ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నా శ్రేయోభిలాషులు, అభిమానులతోపాటు ముఖ్యంగా బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞుణ్ని. వారి ప్రేమ, మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తూనే ఉంది’’ అని వెల్లడించాడు. అలాగే, తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌లోకి, ఢిల్లీ జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. జట్టు యజమానులు, సహాయక సిబ్బంది ఎంతో అండగా నిలిచారని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంతో కలిసి మళ్లీ అభిమానుల ముందు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.



Next Story