ధ్రువ్ జురెల్‌ అసాధారణ ఇన్నింగ్స్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు

by Harish |
ధ్రువ్ జురెల్‌ అసాధారణ ఇన్నింగ్స్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు
X

దిశ, స్పోర్ట్స్ : తండ్రి మాజీ సైనికుడు. పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధంలో దేశానికి సేవలందించారు. తన కొడుకును కూడా ఆర్మీలో చేర్పించాలనేది ఆ తండ్రి కోరిక. అయితే, కుమారుడికి మాత్రం క్రికెట్‌పై మక్కువ. ఆ కొడుకు అనుకున్నది సాధించి టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. మైదానంలో అందరి ముందు తన తండ్రి గౌరవార్థం సెల్యూట్ చేశాడు. ఆ తండ్రి పేరు నేమ్ చంద్ జురెల్.. ఆ కొడుకు ఎవరో కాదు యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్..

రాంచీ టెస్టులో ధ్రువ్ జురెల్ తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో అతను ఆడిన తీరు అసాధారణం. మైదానంలో అతని పోరాట పటిమ అసామాన్యం. అతను సెంచరీనో.. డబుల్ సెంచరీనో సాధించలేదు. కానీ, ధ్రువ్ జురెల్ చేసిన 90 పరుగులే మ్యాచ్‌లో భారత్‌ను పోటీలోకి తెచ్చాయి. టీమ్ ఇండియా 177/7 నుంచి 307 వరకు వచ్చిందంటే కారణం అతనే అని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ధ్రువ్ జురెల్ తన తండ్రి దేశానికి అందించిన సేవలకు గౌరవార్థం మైదానంలో సెల్యూట్ చేశాడు. అయితే, అతను ఆడిన ఇన్నింగ్స్‌కు భారత అభిమానులు ‘హ్యాట్సాఫ్’ అంటున్నారు. అతని ఆట తీరు పట్ల మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు. టీమ్ ఇండియాలో ధ్రువ్ జురెల్ మరో ధోనీలా తయారవుతాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కే పరిమితమైన ధ్రువ్ జురెల్ మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. పేలవ ఫామ్‌తో కేఎస్ భరత్ జట్టులో చోటు కోల్పోవడంతో అతనికి అవకాశం దక్కింది. అరంగేట్ర రాజ్‌కోట్ టెస్టులో 46 పరుగులతో పర్వాలేదనిపించాడు. అశ్విన్‌తో కలిసి 77 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌జురెల్ దేశవాళీలో 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 836 పరుగులు చేయగా.. అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. 7 లిస్ట్ ఏ ఇన్నింగ్స్‌ల్లో 189 పరుగులు, 23 టీ20 మ్యాచ్‌ల్లో 244 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న అతను 11 మ్యాచ్‌ల్లో 152 పరుగులు చేశాడు.

Next Story