సిన్నర్ సంచలనం..ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్‌కు నయా చాంపియన్

by Dishanational3 |
సిన్నర్ సంచలనం..ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్‌కు నయా చాంపియన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్‌కు కొత్త చాంపియన్‌ వచ్చాడు. ఇటలీ స్టార్ జెన్నిక్ సిన్నర్ నయా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్‌లో వరల్డ్ నం.3 మెద్వెదేవ్‌ను చిత్తు చేసి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ సాధించాడు. 2014లో స్విస్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా విజేతగా నిలిచిన తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసిన కొత్త చాంపియన్ అతనే. మధ్యలో నోవాక్ జకోవిచ్ ఆరుసార్లు, రోజర్ ఫెదరర్ రెండుసార్లు, రాఫెల్ నదాల్ ఓసారి విజేతగా నిలిచారు. 10ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త చాంపియన్ వచ్చాడు. అలాగే, 1976లో అడ్రియానో పనట్టా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి ఇటలీ ఆటగాడు సిన్నరే.

ఇటలీ ఆటగాడు జెన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్‌పై 6-3, 6-3, 4-6, 4-6, 3-6 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు. దీంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అయితే, సిన్నర్‌కు ఈ విజయం అంత తేలికగా దక్కలేదు. టైటిల్ పోరు మూడు గంటల 44 నిమిషాలపాటు జరిగింది. మొదటి రెండు సెట్లను చూసిన ఎవరైనా మెద్వెదేవ్‌దే టైటిల్ అనుకుని ఉంటారు. మెద్వెదేవ్ వరుసగా రెండు సెట్లను దక్కించుకోవడంతో సిన్నర్ ఓటమి అంచున నిలిచాడు. ఈ సమయంలో సిన్నర్ పుంజుకున్న తీరు అద్భుతం. అసామాన్య పోరాటం చేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన మూడో సెట్‌ను దక్కించుకుని సిన్నర్ పోటీలోకి వచ్చాడు. 10వ గేమ్‌లో మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా మూడో సెట్‌లో అతను పైచేయి సాధించాడు. నాలుగో సెట్‌ను కూడా సిన్నర్‌ అదే తరహాలో నెగ్గాడు. దీంతో మెద్వెదేవ్, సిన్నర్ చెరో రెండు సెట్లు గెలవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదు సెట్‌కు వెళ్లింది. ఆసక్తికరంగా సాగిన ఐదు సెట్‌లో 6వ గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తోపాటు 7వ గేమ్‌ను నెగ్గి 5-2తో సిన్నర్ ఆధిక్యం సాధించాడు. అదే జోరులో 9వ గేమ్‌లో మ్యాచ్‌ను ముగించి.. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు, 3 డబుల్ ఫౌల్ట్స్, 57 అనవసర తప్పిదాలతో మెద్వెదేవ్ మూల్యం చెల్లించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో మెద్వెదేవ్‌కు ఇది మూడో ఓటమి. 2021, 2022 వరుస ఎడిషన్లలో ఫైనల్‌కు చేరినా టైటిల్ అందుకోలేకపోయాడు. కాగా, సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్‌ను సిన్నర్ మట్టికరిపించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed