తాగొచ్చి ఫుట్‌బాల్ క్రీడాకారిణులపై దాడి.. ఏఐఎఫ్ఎఫ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

by Dishanational3 |
తాగొచ్చి ఫుట్‌బాల్ క్రీడాకారిణులపై దాడి.. ఏఐఎఫ్ఎఫ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ దీపక్ శర్మను గోవా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మద్యం తాగి తమపై దాడి చేసినట్టు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీపక్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. గాయపర్చడం, మహిళలపై దాడి చేయడం వంటి సెక్షన్ల కింద మపుసా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందేశ్ చోడంకర్ తెలిపారు. రిమాండ్ కోసం దీపక్ శర్మను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని మపుసా పోలీసులు పేర్కొన్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఇండియన్ ఉమెన్స్ లీగ్(ఐడబ్ల్యూఎల్)-2 కోసం ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రస్తుతం గోవాలో ఉన్నది. దీపక్ శర్మ ఏఐఎఫ్ఎఫ్ కాంపిటిషన్ కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా, హిమాచల్ ప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నాడు. దీపక్ శర్మ తమపై దాడి చేసినట్టు ఇద్దరు క్రీడాకారిణులు శనివారం ఏఐఎఫ్ఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. ‘గురువారం రాత్రి డిన్నర్ లేకపోవడంతో మేము మా రూంలో గుడ్లు ఉడకపెట్టుకునేందుకు వెళ్లాం. ఈ విషయంపై ఆగ్రహానికి గురైన దీపక్ శర్మ మా రూంలోకి వచ్చి మాపై దాడి చేశాడు. అప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవాకు వస్తుండగా కూడా మా ముందే మద్యం తాగాడు.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ప్రాణహాని ఉందని, ఏఐఎఫ్‌ఎఫ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ మపుసా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శనివారం దీపక్ శర్మను అరెస్ట్ చేశారు. అలాగే, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీపక్ శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ను ఆదేశించారు.



Next Story

Most Viewed