‘ఇషాన్ కిషన్‌ను ఎందుకు పక్కనపెట్టారు?’

by Dishanational5 |
‘ఇషాన్ కిషన్‌ను ఎందుకు పక్కనపెట్టారు?’
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు స్థానం దక్కింది. అయితే, ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలెక్టర్లను ప్రశ్నించాడు. తాజాగా తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘అనూహ్యంగా ఓపెనింగ్‌ స్లాట్‌ను భర్తీ చేశారు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అతను. 4వ స్థానంలో ఆడడు. కాబట్టి, వికెట్ కీపర్ తర్వాతి ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలి. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి సంజూ శాంసన్, మరోటి జితేశ్ శర్మ. అయితే, శాంసన్ గత రెండు సిరీస్‌ల్లో వికెట్ కీపింగ్ చేయలేదు. ఇషాన్ కిషన్ కీపర్‌గా చేస్తున్నాడు. కానీ, అతను జట్టులో లేడు. ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో ఎవరికీ తెలియదు.’ అని వ్యాఖ్యానించాడు. కాగా, ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. జితేశ్ శర్మకు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో టెస్టు జట్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయడంతో ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.




Next Story

Most Viewed