పరువు.. బరువూ.. గుండె చెరువు..!

by  |
పరువు.. బరువూ.. గుండె చెరువు..!
X

దిశ, న్యూస్‌బ్యూరో:

పరువు ప్రతిష్టలు మనిషిని పాతాళానికి దిగజార్చుతున్నాయి. అమానుష హత్యలూ, ఆత్మహత్యలకూ పురిగొల్పుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. అంతకంతకూ సమాజంలో అశాంతిని రాజేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందుకు మిర్యాలగూడ దృష్టాంతం కొనసాగింపే! తిరునగరు మారుతీరావు కులం, పరువుల చుట్టే తన బుర్రను తింపి, కరడుగట్టిన నేర మనస్తత్వానికి బానిసయ్యాడు. ఉజ్వల భవిష్యత్తు గల దళిత యువకుడు ప్రణయ్ ను అమానుషంగా పొట్టనబెట్టుకున్నాడని, ఆ విధంగా తన కుమార్తె అమృత జీవితంలో విషం పోశాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ప్రణయ్ ఫ్యామిలీని కోలుకోలేనంతటి గుండె కోతలోకి నెట్టేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన చివరికి ఏ ప్రాణీ దేకని ఏదో విషానికి లొంగిపోయాడు. అనూహ్యంగా శిక్షించుకున్నాడు. తన ఏకైక కూతురుకీ, ప్రణయ్ కుటుంబీకులకూ తీరని ద్రోహం చేసి, ఏడాదిన్నర తిరక్కముందే..తన అర్థాంగినీ నడివయసులో ఒంటరి చేశాడు. సరిగ్గా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఆ ఇల్లాలిని కన్నీటి సంద్రంలో ముంచేశాడు. ఇట్లా మూణ్ణాలుగు సమీప కుటుంబాల గుండె చెరువు చేశాడు. మిర్యాలగూడ నడి బజారులో సుపారీ గ్యాంగుతో ప్రణయ్‌ను మర్డర్ చేయించిన 2018 సెప్టెంబరు 14 నుంచి, తను ‘చితి’కిపోయే వరకూ పరువు తెచ్చిపెట్టిన ఉపద్రవంతో వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలనూ, మరో వంక సొసైటీని ఒకింత అతలాకుతలం చేశాడు.

గౌరవ మర్యాదలు గల్లంతై..

కులం కూడు పెడుతుందా? గూడునిస్తుందా? గుడ్డనిస్తుందా? మనిషికి మినిమమైన ఈ మూడూ భిన్న కులాలు, మతాల స్వేదంతోనే కదా సమకూరేది! అంతెందుకు? ఓన్ కమ్యూనిటీ వారు ఏమేరకు బ్లెస్ చేస్తుంటారు? ఎంతెంత సపోర్టుగా ఉంటారు? తన తెలివితేటలతో కోట్లకు కోట్ల ఆస్తులు ఆర్జించిన మారుతీరావు సింపుల్ లాజిక్‌ను ఎట్లా మిస్సయ్యాడనే చర్చ జరుగుతోంది. అన్నేసి ప్రాపర్టీస్ ఉన్నా.. జెస్ట్ రూ.50 వేలు కోర్టు తదితర ఖర్చుల కోసం జేబులు తడుముకొంటూ, దిక్కులు చూశాడట. దగ్గరి వారినీ వీరినీ అడుగుతుంటే..తన ‘కులం’ ఎందుకు ముఖం చాటేసింది? ఓన్ క్యాస్టులో ఏ ఒక్క వ్యక్తీ సహాయానికి ఎందుకు ముందుకు రానట్టు? కనీసం సమీప బంధువులూ పెండ్లి పత్రిక ఎందుకివ్వనట్టు? కులం అనేది మతి లేని అహంకారపు అలంకారమేకానీ, గుణం కదా అసలు సుగుణమని గ్రహించేలోపే లోకం వీడాడా? సంఘంలో ఏ గౌరవ మర్యాదలు పోతాయని ప్రాణాలు తీయించడానికి తెగబడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడో.. ఆ గౌరవ మర్యదాలే గల్లంతై..బలవన్మరణం చెందాడనే అనలైజ్ ముందుకొస్తున్నది. ఓట్ల కోసం కులాలను బలోపేతం చేస్తూ, చైనా, అమెరికా గోడల కంటే విస్తారంగా ప్రచ్ఛన్న అడ్డుగోడలు కడుతున్న పార్టీలు, పాలకులు, పోలీసు ఎఫ్ఐఆర్‌లో కులం కాలమ్ వంటివి ఆధునిక సమాజపు ఖర్మ కాకపోతే మరేంటీ? కులాలను ఫాలో అయ్యేవాళ్లు అవుతుంటారు. వాటి కట్టుబాట్లను అనుసరించని వాళ్లకు కీడు తలపెట్టడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రేమ బ్రహ్మాండం.. తీరు అధ్వానం!

తాను చచ్చే ముందు రాసినట్టు భావిస్తున్న5 పదాల చీటీలోనూ ‘అమృత’మైన పేగు బంధాన్నే తలిచాడు. అమ్మ చెంతకు రా అంటూ చివరి కోరిక కోరాడు. పుట్టిన కాడి నుంచి, తాను మట్టిలో కలిసే చివరి ఘడియల వరకూ బిడ్డ మీద బ్రహ్మాండమైన ప్రేమను చాటాడు. ఆ బిడ్డ ప్రేమించి, పెళ్లాడిన ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించి తనలోని చండాలపు, ఉన్మాద బుద్ధినీ చాటుకున్నాడు. తనలోని అసలైన ప్రేమకు వ్యాల్యూ లేకుండా చేశాడు. రెంటికీ కాదు, అన్నింటికీ చెడ్డ రేవడయ్యాడు. కుమార్తె పట్ల తన వాత్సల్యం ఎంత గొప్పదో, ఆమెకు తన భర్త పట్ల అంతే గొప్ప ప్రేముందని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. తనలోని మెచ్యూరిటీని శంకించి, పరీక్షించుకోవాల్సింది పోయి.. అమ్మాయిలోని పరిపక్వతను తక్కువ అంచనా వేశాడు. విద్యార్థినిగా ఉన్నపుడే మనసులు కలిశాయి. చట్ట ప్రకారం ఏజ్ ఎలిజిబిలిటీతో ఒక్కటయ్యారు. దాంపత్య అనుభూతులు ఆస్వాదిస్తున్నలోపే అంతటి అమానుషంగా ప్రణయ్‌ను హతమార్చింపజేసినా నేటికీ స్టెబిల్‌గా ఉండడం ఆమె ప్రేమలోని అసలైన మెచ్యూరిటీ కాదా? కులం మినహాయిస్తే, ప్రణయ్‌ది ఉద్యోగ కుటుంబం. డబ్బూ దస్కానికి లోటే లేదు. సింపుల్‌గా అనుకోవాలంటే, కులం పిచ్చే మారుతీరావును పిచ్చోడిని చేసింది. చక్కటి యువకుడిని బలిగొంది. బొచ్చెడు ఆస్తి, పాస్తులున్నాయి కాబట్టి, తన అనుభవం మేరకు వ్యవస్థలను, వ్యక్తులనూ మేనేజ్ చేయొచ్చనే అతి, మూర్ఖ విశ్వాసమే అంతటి తెగింపునకు ఉసిగొల్పి ఉండొచ్చు. తీరా చూస్తే, పడబోయే శిక్ష రూపంలో భవిష్యత్ దర్శనం మదిలో కదలాడినట్టుంది. తనలోని వికృతానికి ఏడాదిన్నర తిరక్కుండానే విచారం, విరక్తి ఆవరించినట్టున్నాయి. తుదకు తన జీవితాన్నే ‘విషా’దాంతం చేసుకున్నాడు. సరిగ్గా, మహిళా దినోత్సవం నాడే ఇల్లాలు గిరిజకు పుట్టెడు దు:ఖాన్ని మిగిల్చాడు. బహుషా అందుకేనేమో తన అర్ధాంగికి ‘అక్షరాలా’ అపాలజీ చెప్పుకొన్నాడు.

మిర్యాలగూడ ఉదంతంలో కారాలూ, మిరియాలూ!

‘దిశ’ దృష్టాంతంకంటే ముందు తెలంగాణలో ఎందరినో చలింపజేసినది మిర్యాలగూడ ఉదంతం. నాటి ఆ క్రూరత్వం నేపథ్యాన సొసైటీలో ముఖ్యంగా సోషల్ మీడియాలో లెక్కకందని భిన్న వాదనలు, కటువైన వ్యాఖ్యానాలు పొంగిపొర్లాయి. ఆ కామెంట్ల కారాలూ, మిరియాల ఘాటుకు హబ్బో, దీనిపై మాట్లాడితే ఏంటో, మాట్లాడకుంటే ఏంటో! అనేంతటి సంకట వలయంలోకి నెట్టాయి. మారుతిని శపించిన వాళ్లూ ఉన్నారు. తక్షణ బాధితురాలిని తప్పుబట్టిన వారూ ఎందరో! నేటికీ ఆ భిన్నాభిప్రాయాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ‘ఏం సాధించావు మారుతీ! బిడ్డకు సంస్కారం నేర్పకపోతివి..’ అని ఒకవైపు, ‘చేసిన పాపానికి పశ్చాత్తాపంతో పోయాడులే..’ అని మరోవంక డిఫరెంటు ఒపీనియన్సు బోలెడు పోటెత్తుతున్నాయి. ఆ మాటున మారుతిలోని తన బిడ్డ పట్ల అచంచల ప్రేమ, అమృతలో భర్త మీద అంతేలేని ప్రేమను మరుగున పడేస్తున్నాయి! పదునైన సుపారీ కత్తి వెంటాడి బలి తీసుకుంటే, ప్రతిగా సైలెంటు పాయిజను ప్రాణం తీసింది. ఆ కత్తికైనా, ఈ విషానికైనా పాపం ఏం తెలుసు! తీరని హాని తలపెడుతున్నామనీ! మిర్యాలగూడ బాధాకర ఘటనలు సమాజానికి ఎన్నో అప్‌డెటెడ్ లెసన్స్ నేర్పుతున్నాయి! కులంకన్నా గుణం, మానవత్వం గొప్పదనే ఇండికేషన్‌పైనైనా ఏకాభిప్రాయం కుదరాలని ఆశించొచ్చా!?

Tags: miryalaguda incident, caste impact in society, maruti rao, Amurtha, pranay, political parties, rollers

Next Story

Most Viewed