అమ్మా.. నన్ను కన్నందుకు ‘నో థ్యాంక్స్’

by  |
అమ్మా.. నన్ను కన్నందుకు ‘నో థ్యాంక్స్’
X

దిశ, హైదరాబాద్: ఇంకా కళ్లు తెరవనేలేదు.. ఈ లోకం కుళ్లు చూడనేలేదు.. అమ్మ చేతి స్పర్శను చవిచూడలేదు. నాన్న ముద్దాడలేదు, నానమ్మ లాలించలేదు. అమ్మమ్మ ఎత్తుకోలేదు, తాతయ్య మురవలేదు. కానీ, పురుడు పోసుకున్న క్షణంలోనే ఆ బిడ్డ అమ్మ, నాన్నలేని జీవితాన్ని రాసుకుంది. అనాథ అనే ముద్ర వేయించుకుంది. మనల్ని కన్నతల్లి కూడా ఓ ఆడదే. మనకూ అమ్మలక్కలు ఉన్నారన్న సోయి మరిచారో ఏమో తెలియదు కానీ, రక్తపుగుడ్డు జీవితాన్ని ప్రశ్నార్థకం చేశారు. పుట్టగానే, చిన్నటి గొంతుతో ఏడుస్తూ తల్లి పొత్తిళ్లలో మహరాణిలా గడుపుతూ, అమ్మ చనుబాల దార కోసం తారాడుతూ, కడుపు నిండగానే కునుకు తీయాల్సిన పసికందును పురుడు మంచం నుంచి బయటకు తెచ్చి చెత్తకుప్పలో పడేశారు కనికరంలేని మనుషులెవరో… హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

శనివారం ఉదయం 5 గంటల తర్వాత నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి గేటు వద్ద ఉన్న చెత్తకుండిలో పసిపాప కేకలు… అప్పుడప్పుడే నిద్రలేస్తున్న స్థానికులకు శిశువు ఏడుపు వినపడుతోంది. ఈ సమయంలో ఫీవర్ ఆస్పత్రి గేటు వద్ద పసికందు కేకలు ఏంటని హడావుడిగా వచ్చిన సిబ్బంది, స్థానికులు చెత్తకుప్పలో ఉన్న శిశువును చూసి ఒక్కసారిగా ఉద్విగ్నానికి గురయ్యారు. రక్తపు మరకలతో గోసపడుతూ ఊపిరి బిగబట్టి ఏడుస్తున్న శిశువును బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పాపకు వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రీట్‌మెంట్ చేసిన సిబ్బంది మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో బుర్ఖా ధరించిన ఓ వ్యక్తి… శిశువును చెత్తకుప్పలో పడేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Next Story

Most Viewed