సూర్యరశ్మి నుంచి ఇంధనం.. వైర్‌లెస్‌గా!

by  |
సూర్యరశ్మి నుంచి ఇంధనం.. వైర్‌లెస్‌గా!
X

సూర్యుని నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే విధానాల్లో సోలార్ ప్లేట్‌లు, ప్యానెళ్ల ద్వారా చేసే విధానాలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్, నీరు ద్వారా తటస్థ కర్బన ఇంధనాన్ని తయారుచేసే ఒక వైర్‌లెస్ పరికరాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. అడ్వాన్స్‌డ్ ఫొటోషీట్ టెక్నాలజీ ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ ఫొటోషీట్‌లో ఉన్న ఫొటోకేటలిస్ట్‌లు.. సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్, నీళ్ల నుంచి ఫార్మిక్ ఆమ్లాన్ని తయారుచేస్తాయి. ఇదొక స్థిరమైన ఇంధనం. దీన్ని కావాలంటే నేరుగా ఇంధనంగా వాడుకోవచ్చు లేదంటే హైడ్రోజన్ తయారీకి ఉపయోగించుకోవచ్చు.

ఈ పరికరం పనిచేయడానికి అదనపు ఎలక్ట్రిసిటీ గానీ, విడిభాగాలు గానీ అవసరం లేదు కాబట్టి తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమంగా కిరణజన్య సంయోగక్రియ చేయించడానికి ఈ ప్రయోగం ఒక మెట్టుగా ఉపయోగపడుతోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం వేరే పదార్థాలను కూడా కేటలిస్ట్‌లుగా వాడి వేర్వేరు రకాల సోలార్ ఇంధనాలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో సుస్థిరాభివృద్ధికి దోహదపడే ఇంధనాల ఉత్పత్తి సులభతరం అవుతుందని ప్రొఫెసర్ ఎర్విన్ రైస్నర్ అంటున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed