అవినీతి గంతులు.. నాణ్యత లేని స్మార్ట్‌ సిటీ

by  |
అవినీతి గంతులు.. నాణ్యత లేని స్మార్ట్‌ సిటీ
X

దిశ, కరీంనగర్ సిటీ: ‘రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కరీంనగరాన్ని మరో డల్లాస్‌గా చూడటమే నా కల. అందుకోసమే కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్పించాను. ఇక పనుల ప్రారంభమే తరువాయి, నగరం ఆకర్షణీయంగా మారుతుంది. తెలంగాణ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది’’ అంటూ.. సీఎం కేసీఆర్ మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, నగర పర్యటనకు వచ్చి చేసిన వ్యాఖ్య ఇది. అన్నట్లుగానే నగరానికి స్మార్ట్ సిటీ హోదా వచ్చింది. కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. మరికొన్ని కొనసాగుతున్నాయి. కానీ, పనుల్లో నాణ్యత లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపట్టిన పనుల్లో అవినీతి గంతులేస్తుండగా, నాణ్యత, అభివృద్ధి మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి.

నామ్‌కే వాస్తే..

వేసిన రహదారులు, పోసిన మురికి కాల్వలు నామ్ కే వాస్తే అన్నట్లుగా మారాయి. అడుగు వేస్తే కూలుతున్న పైకప్పులు, భారీ వాహనం వెళ్తే కుంగుతున్న రహదారులు, పాదచారులు నడవకుండా కుంగిన ఫుట్‌పాత్‌లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తుండడం సర్వసాధారణంగా మారిందని, అధికార పార్టీ కార్పొరేటర్లే బాహాటంగా మాట్లాడుతున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న అవినీతికి నిదర్శనంగా ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. అమృత్ నిధులతో చేపట్టిన తాగునీటి పైప్ లైన్ల ఆధునీకరణ కూడా అస్తవ్యస్తంగా మారి, ప్రధాన రహదారులపై నీటి బుడగలు ఉబికివచ్చి ఫౌంటేన్లను తలపిస్తున్నాయి.

అయినా, సంబంధిత సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదని నగరవాసులు మండి పడుతున్నారు. వందల కోట్లతో చేపడుతున్న పనులపై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించాల్సిన బల్దియా యంత్రాంగం చోద్యం చూస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నేతలు సైతం ఈ పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, పలువురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు చేసిన ఫిర్యాదులు సీఎం కార్యాలయానికి కూడా చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పనులల్లో నాణ్యత పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed