‘నల్లనేల’పై అందమైన ఇళ్లు!

49

దిశ ప్రతినిధి, ఖమ్మం: సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం కొత్త, సౌకర్యవంతమైన క్వార్టర్లను నిర్మిస్తోంది. తొలి దశలో రూ.333 కోట్లతో 1,478 క్వార్టర్లకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో 352 గృహాలు జూన్‌ నెల నాటికి పూర్తికానుండగా మిగిలినవి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి కార్మికులందరికీ కేటాయించనున్నారు. ఉద్యోగులందరికీ కంపెనీ క్వార్టర్లలోనే నివాసం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త క్వార్టర్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.

గతంలో సింగరేణి క్వార్టర్లు కేవలం ఒక బెడ్‌ రూం, ఒక చిన్న హాలు, చిన్న కిచెన్‌ కలిగి చాలా ఇరుకుగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కూడా కొత్తగా నిర్మించే క్వార్టర్లలో డబుల్‌ బెడ్‌ రూంతో పాటు హాలు, కిచెన్‌, కామన్‌ ఏరియాతో కలిపి 963 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే రూ.216 కోట్లతో 994 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న 352 క్వార్టర్ల నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సుమారు రూ.37 కోట్లతో నిర్మిస్తున్న మరో 132 క్వార్టర్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..