డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు ఖాతాలు

by  |
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు ఖాతాలు
X

దిశ, ఫీచర్స్ : చిన్ననాటి జ్ఞాపకాల్లో పిగ్గీ బ్యాంకు(గల్లాపెట్టె) తప్పనిసరిగా ఉంటుంది. చుట్టాలతో పాటు ఇంట్లో ఎవరు డబ్బులిచ్చినా సరే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ గల్లాపెట్టెల్లో డబ్బులు వేయడం భలే సరాదాగా ఉంటుంది. కావల్సినవి కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బుల్ని పిగ్గీ బ్యాంకులో దాచుకోమంటూ పేరెంట్స్ చెబుతారు కానీ అందులో దాగున్న పొదుపు ప్రాముఖ్యతను పిల్లలకు వివరించడంలో ఫెయిల్ అవుతుంటారు. అయితే కాలాలు మారుతున్న కొద్దీ కొత్త తరాల నూతన ఆలోచనలతో ‘లైఫ్‌ స్టైల్’లోనూ మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలో మునుపటి తరం కంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న ఈ-తరం పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను నేర్పేందుకు కొన్ని సూపర్ స్మార్ట్ మార్గాలను తెలుసుకోవడం ఉత్తమం.

అనేక బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేక పొదుపు ఖాతాల సౌకర్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఈ డిజిటలైజేషన్ విప్లవాన్ని ఉపయోగించుకోవడం అందరకీ శ్రేయస్కరం. పిల్లల పొదుపు ఖాతాను మైనర్ అకౌంట్‌గా లేదా గార్డియన్‌షిప్/జాయింట్ అకౌంట్‌గా కూడా ఓపెన్ చేయొచ్చు. దీని ద్వారా ప్రతి నెలా ఆ సేవింగ్స్ ఖాతాలో పాకెట్ మనీగా కొంత మొత్తాన్ని వెంటనే జమ చేయవచ్చు. అంతేకాదు పిల్లలు ఆ పొదుపు ఖాతాలో ‘టార్గెట్ అమౌంట్’ ఆదా చేయగలిగితే నెలవారీ ‘పేరెంటల్ ఇంట్రెస్ట్’ అందిస్తామంటూ డబ్బు ఆదా చేయడంలో వారికి ఆసక్తిని కలిగించవచ్చు. అదేవిధంగా నెలవారీ ఖర్చులను కూడా కంట్రోల్ చేసే అవకాశముంది. దీంతో పిల్లలు ఆ అదనపు క్యాష్ సంపాదించేందుకు మరింత పొదుపు చేయడంలో ఆసక్తి కనబరుస్తారు. పెరుగుతున్న బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా ప్రతీ నెలా పెరుగుతున్న వారి డబ్బును చూసినప్పుడు దాని విలువను కూడా అర్థం చేసుకుంటారు.

టాస్క్‌‌లతో మనీ ఎర్నింగ్

వీక్లీ వైజ్ లేదా నెలవారీ పనులను సెట్ చేయడంతో పాటు వాటిని పూర్తి చేసినపుడు కొంతమొత్తంలో క్యాష్ ప్రైజ్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు డబ్బు ప్రాముఖ్యతను బోధించవచ్చు. హోంవర్క్, ఇంటి పనుల్లో సాయంచేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం తదితర పనులు ఏవైనా కావచ్చు. ఈ విధంగా చిన్నారులు ఆ పనుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించడం వల్ల ఆయా విషయాల్లో పట్టు సంపాదించడంతో పాటు వాటి విలువను అర్థం చేసుకుంటారు. పాకెట్ మనీ సంపాదించడంలోనూ ఇది దోహదపడుతుంది. ఒక లక్ష్యం కోసం పని చేయడం చివరికి బహుమతి పొందడం ఎంత మంచి అనుభూతిని కలిగిస్తుందనే విషయాన్ని పిల్లలు ఎప్పటికీ మరచిపోరు.

కోరికలు

పెద్దవారికే కాదు చిన్నారులకు కూడా బోలెడన్ని కోరికలుంటాయి. వాటర్ వరల్డ్‌లో ఆడుకోవాలని, సైకిల్ లేదా తమకు ఇష్టమైన సూపర్‌ హీరో కాస్ట్యూమ్ వంటివి పొందాలని కోరుకుంటారు. ఆ కోరికల చిట్టా సుదీర్ఘంగానే ఉంటుంది. తల్లిదండ్రులుగా వారి కోరికల జాబితాను మీరే పూర్తి చేయడానికి బదులు, పాకెట్ మనీ నుంచి ఆదా చేసి ఆ కోరికల జాబితాను ఫుల్‌ఫిల్ చేసేందుకు ఉపయోగించమని పిల్లలకు సూచించాలి.

లీడ్ తీసుకోవాలి

చెప్పడం కన్నా చెయ్యడం మిన్న. డబ్బు గురించి వారికి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడానికి బదులు, ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేయాలి. షాపింగ్‌కు వెళ్లినప్పుడు, ఒక వస్తువు ధరలను పోల్చుతూ.. ఏది ఖరీదైనది? పేర్కొన్న ధరకు ఏది విలువైందో? చెప్పడంతో పాటు వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి చూపించండి. కొనుగోలు చేసిన వస్తువులు కూడా ఉపయోగకరమైనవా? కాదా? వివరించాలి. ఆ మొత్తంలో వీలైనంత ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి. అంతేకాకుండా వారిని ఇంటి బడ్జెట్ లేదా మనీ డిస్కషన్స్‌లో కూడా పాల్గొనేందుకు ఆహ్వానించాలి. షాపింగ్‌కు ముందు వేసుకున్న బడ్జెట్ ప్రకారమే ఖర్చు పెట్టామా లేదా? వంటి విషయాలు కూడా తెలియజెప్పాలి. మనీ ఇంపార్టెన్స్ గురించి వారికి కూడా ఓ అవగాహన కలుగుతుంది.

డబ్బును బహుమతిగా ఉపయోగించడం మానుకోండి. జీవితంలో ఒకరికి సాయం చేయడానికి డబ్బు ఒక సాధనమని పిల్లలకు నేర్పడం ఉత్తమం. డబ్బులు ఊరికే రావని, డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కష్టపడతారని వివరించాలి.



Next Story

Most Viewed