వైద్యులను తికమక పెడుతున్న కొవిడ్ న్యూమోనియా

by  |
వైద్యులను తికమక పెడుతున్న కొవిడ్ న్యూమోనియా
X

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 కోసం చికిత్స చేస్తున్న సమయంలో సైలెంట్ హైపోక్సియా అనే పరిస్థితి వల్ల కలుగుతున్న కొవిడ్ న్యూమోనియా వైద్యులను తికమక పెడుతోంది. శరీర, రక్త కణాల్లో కావాల్సినంత ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల హైపోక్సియా పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సరిపడనంత ఆక్సిజన్ మెదడుకు చేరకపోవడంతో పేషెంట్ పిచ్చిగా ప్రవర్తించడం, ఆందోళనతో చెమట పట్టడం వంటివి జరుగుతుంటాయి.

అయితే కొవిడ్ 19 పేషెంట్లలో కనిపించే హైపోక్సియా ఇందుకు భిన్నంగా ఉంది. ఆక్సిజన్ మెదడుకి తక్కువగా అందుతున్నప్పటికీ పేషెంట్లో ఎలాంటి హైపోక్సియా లక్షణాలు కనిపించడం లేదు. అంతేకాకుండా చాలా స్థిమితంగా ఉంటున్నారు. అందుకే దీన్ని సైలెంట్ హైపోక్సియా అని ఫిజిషియన్ డాక్టర్ రిచర్డ్ లెవిటాన్ పేరు పెట్టారు. కొవిడ్ 19 పేషెంట్లలో మెదడుకి 80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతున్నప్పటికీ వాళ్లలో హైపోక్సియా లక్షణాలు కనిపించడం లేదని, కానీ కొద్దిసేపటికి వారు కొవిడ్ న్యూమోనియా బారిన పడడంతో పరిస్థితి విషమంగా మారుతోందని రిచర్డ్ చెబుతున్నారు.

అయితే వారు న్యూమోనియా బారిన పడటానికి ఆక్సిజన్ తక్కువ ఉండటం కారణం కాదని, కరోనా వైరస్ వల్ల ఊపిరితిత్తుల పరిమాణం తగ్గి, అందులో కార్బన్ డైయాక్సైడ్ పరిమాణం పెరగడం వల్లేనని రిచర్డ్ వెల్లడించారు. అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయి కనుక్కోవడానికి పల్స్ ఆక్సిమీటర్ పరికరాన్ని ఉపయోగించి, సైలెంట్ హైపోక్సియాను గుర్తించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలని రిచర్డ్ పేర్కొన్నారు.

Tags: corona, covid, silent hypoxia, lung, pulse oximeter, blood, covid pneumonia



Next Story

Most Viewed