ఉద్యోగుల తొలగింపు.. కమీషన్ల కోసమేనా..?

by  |
ఉద్యోగుల తొలగింపు.. కమీషన్ల కోసమేనా..?
X

దిశప్రతినిధి, మెదక్ : సిద్ధిపేట మున్సిపాలిటీలో అధికారుల ఒత్తిడి తీవ్రమైంది. అదే స్థాయిలో అవినీతి సైతం పెరిగింది.దీంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంత మందిని తొలగించగా మరికొందరిని తొలగించి కొత్త కార్మికులను ఉద్యోగంలో చేర్చే పనిలో మున్సిపల్ అధికారి బిజీ అయినట్టు తెలుస్తోంది. సకాలంలో వేతనాలు అందించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ‘దిశ’పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

పలువురు ఉద్యోగుల తొలగింపు..

సిద్ధిపేట మున్సిపాలిటీలో అభివృద్ధి మాటున అవినీతి రాజ్యమేలుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై దిశ పలుమార్లు ప్రత్యేక కథనాలను ప్రచురించింది. బిల్ కలెక్టర్ల తొలగింపు విషయం, మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన అవినీతి, రిటైర్డ్ అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమించడం, ఇతరత్రా అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారుల తప్పిదాలను హెచ్చరిస్తూనే వచ్చింది. వెంటనే బిల్ కలెక్టర్ తొలగింపును ఉపసంహరించుకున్నారు. తాజాగా ఆ విభాగంలో కాకుండా టీపీవోలో పనిచేసే చైన్ మెన్లను, రెవెన్యూ, వాటర్, శానిటరీ, ఇతర విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులను కొందరిని తొలగించారు. మరికొందరిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిద్దిపేట మున్సిపాలిటీలో సుమారు వంద మంది కార్మికులను తొలగించినట్టు సమాచారం. మరో వంద మందిని కూడా తొలగించాలని మున్సిపల్ కమిషనర్ యత్నిస్తున్నట్టు కార్మికులు చెబుతున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడన్న ఆరోపణతో మున్సిపల్ కమిషనర్ వాటర్ విభాగంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించడంతో ఆ ఉద్యోగి కుటుంబ పోషణ భారమై మృతి చెందాడు.

కొత్త ఉద్యోగాలకు ఫైరవీలు, డబ్బుల డిమాండ్..?

కమిషన్ల కోసం కక్కుర్తి పడిన అధికారులు పాత ఉద్యోగులను తొలగించి కొత్త ఉద్యోగులను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏదోలా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులను తొలగించేందుకు వేతనాలు అందించక, పని సమయం పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే కొంత మందిని తొలగించి వారి స్థానంలో కొత్త ఉద్యోగులను నియమిస్తున్నారు. అయితే నియామక సమయంలో ఒక్కో వ్యక్తి వద్ద సుమారు రూ.రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా అధికార పార్టీ నాయకుల ఫైరవీలు బాగా పెరిగాయి. అధికార పార్టీ నాయకులు, టీఆర్ఎస్ కౌన్సిలర్లకు అనుకూలంగా ఉన్న వారిని, వారి బంధువులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పెట్టిస్తున్నారన్న చర్చ సైతం జోరుగా సాగుతుంది. దీనిపై ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై అనుమానం వ్యక్తమవుతుంది.

పారిశుధ్య కార్మికుల ధర్నా..

కార్మికుల పట్ల మున్సిపల్ కమిషనర్ దుర్భషలాడుతున్నాడని, సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నా చేశారు. బయోమెట్రిక్ విధానం వలన సకాలంలో వేతనాలు అందకపోవడమే కాకుండా తక్కువ వేతనం అందిందని ఆరోపిస్తూ ధర్నా కార్మికులు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. దీనికి స్పందించిన కమిషనర్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. గతంలోనూ యూజీడీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరిస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed