ఫ్రిజ్‌లో పెట్టకూడనివేంటో తెలుసా?

by  |
ఫ్రిజ్‌లో పెట్టకూడనివేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. అయితే పాల నుంచి పన్నీరు వరకు, కూరగాయల నుంచి కర్రీల వరకు.. ఇలా ఏది పడితే అది ఫ్రిడ్జ్‌లోకి తోసేస్తుంటారు. అసలు ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టాలో ? ఏమేం పెట్టకూడదో తెలుసా? అంటే చాలా మందికి తెలియదనే చెప్పాలి.

సాధారణంగా చాలా మంది ఫ్రిడ్జ్‌లో ఏ వస్తువు పెట్టినా ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తారు. కానీ ఆ భావన చాలా తప్పు. కొన్నింటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ప్రమాదమంటే.. ఫ్రిడ్జ్‌ పేలిపోతుందని అర్థం కాదు, అందులో నిల్వ ఉంచిన వాటిని తింటే లేనిపోని రోగాలను మనమే కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కేన్సర్‌ కారకాలుగా మారతాయి. మరి కొన్ని ఫుడ్స్‌ విషతుల్యమవుతాయి. అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టే ఆహారపదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

– బంగాళాదుంప, ఉల్లిపాయలను ఫ్రిడ్జ్‌లో ఎట్టి పరిస్థితిల్లోనూ పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్‌‌లో పెట్టటం వలన బంగాళాదుంపల్లోని పిండిపదార్ధంలో చక్కెర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఉల్లిపాయలు చాలా త్వరగా పాడైపోయి.. ఇతర ఆహారపదార్ధాలను కూడా పాడు చేస్తాయి.

– చాలామంది ‘బ్రెడ్’ త్వరగా పాడైపోతుందని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. కానీ బ్రెడ్‌ను అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దాంతో అది డ్రైగా మారుతుంది. బూజు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది.

– యాపిల్, అరటి, బెర్రీలు, నారింజ, మోసంబి, జామ వంటి పండ్లది కూడా అదే పరిస్థితి. వాటిని ఫ్రిడ్జ్‌లో పెడితే రుచులు మొత్తం మారిపోతాయి. ఒకవేళ మీరు కచ్చితంగా పండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకుంటే మాత్రం.. తినడానికి ముందు ఒక 30 నిమిషాల పాటు ఉంచుకోవచ్చు.

– కొంతమంది నూనెను కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచుతుంటారు. ఇది కూడా మంచిది కానే కాదు. ఇంట్లో ఉండే ఉష్ణోగ్రతకు అనుకూలంగా నూనెను నిల్వ చేయడం మంచిది.

– టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టటం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి, విటమిన్- సి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. అదే విధంగా గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల లోపలి భాగం పాడైపోయి పెంకుపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీంతో వాటిని ఉడికించినా ఏమంత రుచిగా ఉండవు. ఈ విషయాలను వాటిపై కొన్ని నెలలుగా పరిశోధనలు చేసిన నిపుణులు.. ఇటీవలే వెల్లడించారు. గది ఉష్ణోగ్రతలోనే కోడిగుడ్లు, టొమాటోలను నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

– పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు పుచ్చకాయలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెడితే యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయి.

– కాఫీ పొడిని ఫ్రిడ్జ్‌లో భద్రపరుస్తుంటారు. అలా చేయడం వలన కాఫీలో ఉండే హైగ్రోస్కోపిక్ నేచర్.. తేమను ఏక్కువగా పీల్చుకుంటుంది. దాంతో కాఫీ ఫ్లేవర్ మారిపోతుంది. అందువల్ల కాఫీ పొడిని ఫ్రిడ్జ్‌లో కాకుండా గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసి డార్క్ ప్లేస్‌లో పెట్టాలి.

సో.. ఇకపై ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి మరి.

Next Story