నిరుద్యోగులకు షాక్.. ఇక ఆ ఉద్యోగాలు లేనట్టే…?

by  |
నిరుద్యోగులకు షాక్.. ఇక ఆ ఉద్యోగాలు లేనట్టే…?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషనలైజేషన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇక డీఎస్సీ నోటిఫికేషన్ లేనట్టుగానే కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ అవసరముండగా ప్రస్తుతం 14 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అవరసరానికి మించి టీచర్లు ఉండటంతో నూతనంగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెనకడుగు వేయనుంది. హేతుబద్దీకరణ ద్వారా ఎక్కువ మంది టీచర్లు ఉన్న పాఠశాలనుంచి తక్కువ మంది టీచర్లున్న పాఠశాలలకు బదిలీకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మంది టీచర్లు సర్దుబాటుకానున్నారు. టీచర్ ఉద్యోగాలు లేకపోవడంతో ఈ ప్రభావం బీఈడీ కళాశాలలపై పడనుంది. ఈ ఏడాది బీఈడీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనున్నాయి.

ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ నిరుద్యోగులకు శాపంగా మారింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బీఈడీ, టీటీసీ అభ్యర్థులను నిరాశే ఎదురుకానుంది. ప్రభుత్వం త్వరలో భర్తీ చేస్తామన్న 50వేలకు పైగా ఉద్యోగాల్లో టీచర్ పోస్టులు లేనట్టుగానే తెలుస్తోంది. సర్కారు బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు కారణమంతుంది. విద్యార్థులు, టీచర్ల రేషియో ప్రకారం ఉండాల్సిన వారికంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించనుకునేలా ఉంది.

రేషనలైజేషన్‌తో టీచర్ల బదిలీలు

రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏ జిల్లాలో, ఏ జోన్‌లో, ఏ మల్టీ జోన్‌లో ఎంత మంది అధికారులు, ఉద్యోగులు ఉన్నారన్న విషయం తేలనుంది. దీని ప్రకారమే ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. కొత్త జిల్లాల వారీగా పాఠశాలలో అవసరమైన ఉద్యోగుల సంఖ్యను తేలుస్తారు. అనంతరం ఎక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి తక్కువ మంది ఉపాధ్యాయులన్న పాఠశాలకు టీచర్లను బదిలీ చేయనున్నారు.

అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులు

ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరానికి మించి ఉపాధ్యాయులున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని నిబంధనలుండగా ప్రస్తుతం 14 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టడంతో దాదాపుగా 13 వేల మంది టీచర్లు ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో నూతనంగా టీచర్లు అవసరం లేదనే ప్రభుత్వం భావిస్తోంది.

ప్రత్యేక రాష్ట్రంలో ఒకే ఒక్క డీఎస్సీ

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి రాష్ట్రంలో ఒకే ఒక్క డీఎస్సీని మాత్రమే ప్రభుత్వం నిర్వహించింది. 2017లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 8,792 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా వీటిలో తెలుగు మీడియంలో 7,892 పోస్టులు, 900 ఉర్డూ మీడియం పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలు పొందిన వారికి విడతల వారిగా పోస్టింగ్‌లు కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క డీఎస్సీ నిర్వహించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా భర్తీ చేస్తామన్న 10వేల టీచర్ పోస్టులు కూడా ఉండే అవకాశం లేకపోవడంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ప్రతి ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, భర్తీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

తగ్గిపోనున్న బీఈడీ అభ్యర్థుల సంఖ్య

రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో ఈ ఏడాది బీఈడీ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. కొలువు లేని కోర్సును చదవడం ఎందుకని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటులో కూడా టీచర్ ఉద్యోగాలు లేకపోవడంతో ఈ వృత్తిని ఎంచుకునేందుకు యువత ముందకు రావడం లేదు. కరోనా ప్రభావంతో 90శాతం మంది ప్రైవేటు టీచర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దాదాపుగా 50శాతం మంది టీచర్లు వేర్వేరు వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఇంతటి సంక్షోభంలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లేందుకు విద్యార్థులు సహసం చేయడం లేదు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చాలా వరకు బీఈడీ కళాశాలలు మూతపడే అవకాశాలున్న స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story

Most Viewed