నా జీవితంలో కష్టమైన మ్యాచ్ అదే : షమీ

by  |
నా జీవితంలో కష్టమైన మ్యాచ్ అదే : షమీ
X

‘అతడో పడి లేచిన కెరటం. బౌలింగ్‌లో పస తగ్గిందని, ఇక అతని పనైపోయిందంటూ ఎన్ని విమర్శలెదురైనా.. మొక్కవోని దీక్షతో టీమిండియా బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఓ సమయంలో క్రికెట్ కెరీర్‌తో పాటు జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులెదుర్కొన్నా, తనను తాను నిరూపించుకొని విజేతగా నిలిచాడు.. అతనే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.’ ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన షమీ.. తాజాగా సహచర క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

‘తన జీవితంలో ఎన్నో క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నానని.. కానీ, 2015 ప్రపంచకప్‌‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని’ అన్నాడు. ‘ఆ ప్రపంచకప్ సమయంలో తన మోకాలికి గాయమైందని.. మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తం భరించలేని నొప్పితోనే ఆడానని, రోజుకు మూడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కానీ నొప్పి తగ్గేది కాదని’ షమీ చెప్పాడు. ‘సిడ్నీలో సెమీఫైనల్ జరగడానికి మందే తాను ఆడలేనని యాజమాన్యానికి తెలిపినా.. కీలక మ్యాచ్‌లో కొత్త బౌలర్‌తో ప్రయోగాలు చేయలేమని మేనేజ్‌మెంట్ సర్ధిచెప్పారని’ తెలిపాడు. కాగా, ఆ మ్యాచ్‌లో మూడు పెయిన్ కిల్లర్స్, ఒక ఇంజక్షన్ తీసుకొని బరిలోకి దిగానని, ఫస్ట్ ఓవర్ వేయగానే తీవ్రమైన నొప్పి వచ్చినా.. ధోనీ ధైర్యం చెప్పడంతో ఇన్నింగ్స్ ముగిసే వరకు ఫీల్డ్ ‌లోనే ఉండి తన కోటా ఓవర్లు పూర్తి చేసినట్టు వెల్లడించాడు.

భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాతో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కాగా, షమీ ఈ టోర్నమెంట్‌లో 17 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత క్రీడాకారుల్లో రెండో స్థానంలో నిలిచాడు. ‘ఆ తర్వాత తన కెరీర్ ముగిసిపోతుందని భావించానని.. కానీ, కాలి గాయానికి చికిత్స తీసుకొని.. తిరిగి ఫిట్‌నెస్ సాధించి భారత జట్టులోకి వచ్చినట్టు’ షమీ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

Tags : Mohmod Shami, MS Dhoni, 2015 World cup, Knee injury, Instagramme



Next Story

Most Viewed