రూ. 4 లక్షల పెట్టుబడి పెట్టి.. ట్రాక్టర్‌తో పంటను ధ్వంసం చేయించిన మహిళా రైతు

by  |
Mirchi-Farrmers1
X

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని మిర్చి రైతులు తామర పురుగు కారణంగా పంటనంతా ధ్వంసం చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలే పెట్టిన పెట్టుబడి రాక దిగాలుగా ఉంటున్న రైతుల్ని ఈ ఏడాది వేసిన మిర్చి పంట నిలువునా ముంచింది. ఇటీవల మిర్చి పంటకు సోకిన తామరపురుగు ఎన్ని మందులు కొట్టినా లొంగట్లేదు. పంటను కాపాడుకోవడానికి ఏదో ఒక సలహానో, సూచనో ఇస్తారని ఆశించిన వ్యవసాయ అధికారులు సైతం చేతులు ఎత్తేయడంతో బాధిత రైతులు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యపై స్పందించిన నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి డివిజన్ లోని మిర్చి పంటల్ని పరిశీలించడానికి ఇటీవల బెంగుళూరు నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకొచ్చారు. మిర్చి తోటల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సైతం తామరపురుగు నిర్మూలనకు సరైన సూచనలు చేయకపోవడంతో రైతుల్లో మిర్చి పంటపై ఆశలు సన్నగిల్లాయి.

నాలుగు ఎకరాల్లో పంట వేశా… రూ. 4 లక్షల అప్పు అయింది: శివరాత్రి స్వప్న

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మహిళా రైతు శివరాత్రి స్వప్న 4 ఎకరాల్లో మిర్చి పంట వేసింది. ఎకరాకు రూ. లక్ష చొప్పున పెట్టుబడి సైతం పెట్టింది. అయినప్పటికీ తామరపురుగు మూలంగా మిర్చి పంట దెబ్బతినడంతో తీవ్ర ఆవేదన చెందుతోంది. ఎన్ని మందులు కొట్టినా పంట చేతికి వచ్చే పరిస్థితి కనపడకపోవడంతో నాలుగు ఎకరాల్లో వేసిన మిర్చి పంటను ట్రాక్టర్ తో దున్నించడానికి సిద్ధపడింది.

ఈ నేపథ్యంలో బాధిత మహిళా రైతు మాట్లాడుతూ… మిర్చి పంటకు ఇప్పటికే తహతకు మించి ఖర్చు చేశామని, ఇక చేసే పరిస్థితి లేదని వాపోయింది. రైతు చనిపోతేనే వచ్చే రైతు బీమా, ఆరు నెలలకు ఓసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు మాత్రమే కాకుండా ఇలాంటి కష్టకాలంలో రైతుల్ని ఆదుకోవాలని కోరింది. సంబంధిత వ్యవసాయ అధికారులతో పంట సర్వే చేసైనా వైరస్ మూలంగా దెబ్బతిన్న మిర్చి రైతులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

చై-సామ్ డివోర్స్ ఆమెకు ముందే తెలుసా.. హాట్ టాపిక్‌గా శిల్పారెడ్డి



Next Story