అకాల వర్షం.. వరి పంట నీటిపాలు.. ఆవేదనలో అన్నదాత

by  |
అకాల వర్షం.. వరి పంట నీటిపాలు.. ఆవేదనలో అన్నదాత
X

దిశ, కాటారం : బుధవారం రాత్రి కాటారం మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా వరి ధాన్యం నీటిపాలైంది. చెట్టుపై ఉన్న పత్తి పంట తడిసి ముద్దై నల్లగా మారి పోయింది. వరి, పత్తి పంట వేసిన రైతాంగం తీవ్ర వేదనకు గురవుతున్నారు. చేతికొచ్చిన వరి పంట నీట మునిగిపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురైంది. కల్లంలో వరి ధాన్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో, పంటంతా నీటిలో మునిగిపోయి మొలకెత్తుతోంది. రైతులు ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా పంటను పోశారు.

ఈ వారంలో మూడుసార్లు భారీ వర్షం కురవడంతో వరి ధాన్యం తడిసిపోయి మొలకెత్తుతుండటంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కళ్ళ ముందే చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి పోవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుండి భారీ వర్షాలు ఆ తర్వాత అకాల వర్షాలు రైతును తీవ్రంగా కుంగదీశాయి. పత్తిని తీసే దశలో కూడా అకాల వర్షాలు కురవడంతో చెట్టుపై పత్తి తడిసి ముద్దై పోయి.. తీయడానికి వీలు లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఈ ప్రాంతవాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed