చదివింది ఏడో తరగతే.. కానీ ఇంజనీర్ అయ్యాడు

by  |
చదివింది ఏడో తరగతే.. కానీ ఇంజనీర్ అయ్యాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : అతడు చదివింది ఏడో తరగతే. టాక్టర్లు, బోరు మోటర్లను రిపేర్ చేస్తూ సాధారణ మోకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. లక్షల విలువైన మోటర్లు బోరులో ఇరుక్కుపోతే రైతులు పడే బాధలను స్వయంగా చూశాడు. వారి కష్టాలను కొంచమైనా తీర్చాలని భావించి.. బోర్‌వెల్ కెమెరా తయారీకి శ్రీకారం చుట్టి సఫలీకృతం అయ్యాడు. బోర్లలో ఇరుక్కుపోయిన మోటర్లను అవలీలగా తీస్తూ రైతులను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తూ రైతు బాంధవుడిగా నిలుస్తున్నాడీ ఇంజనీర్ కానీ ఇంజనీర్ వీరాచారి.

కంచర్ల వీరాచారిది సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం. మోకానిక్ పని చేయడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ మోటర్లను బాగు చేయడానికి నిత్యం బావుల వద్దకు వెళ్తుంటాడు. అప్పటి వరకు బోర్లలో మోటర్లు పడితే వాటికి గొలుసులు కట్టి ట్రాక్టర్లతో లాగేవారు. దీని వల్ల 80 శాతం మోటర్లు బోరులోనే ఇరుక్కుపోవడంతోపాటు బోర్లలో మట్టిపడి పూడిపోయేవి. ఆ సమయంలో రైతులు పడుతున్న బాధను చూసి తనే ఇంజనీర్ గా మారిపోయాడు. తన ఆలోచనలకు పదును పెట్టి అధునాతన పరికరాన్ని కనుగొన్నాడు. ఇంజనీర్లకు సాధ్యమయ్యే పనిని తన మెకానిజం నైపుణ్యంతో రైతులకు శాశ్వత పరిష్కారం చూపాడు.

బోరులో ఇరుక్కుపోయిన మోటర్ ఏస్థితిలో ఉన్నదో తెలుసుకోవడం ముఖ్యమని భావించి దాని కోసం వాటర్ ఫ్రూప్ కలిగిన నైట్ విజన్ కెమెరాను కొనుగోలు చేశాడు. మోటరును పైకి లాగేందుకు చైన్ బ్లాక్, గ్రిప్ కోసం ప్రత్యేకమైన బేరింగ్స్ తయారుచేశాడు. కెమెరా విజువల్స్ లైవ్ లో చూసేందుకు మానిటర్ ను తానే స్వయంగా తయారు చేసుకున్నాడు. వీటితోపాటు మరికొన్ని పరికరాలను కొనుగోలు చేశాడు. అవ్వి హైదరాబాద్ లో కూడా లభించకపోవడంతో ఢిల్లీ వెళ్లి కొనుగోలు చేశాడు. ఇలా మొత్తం రూ.2లక్షలను వెచ్చించి బోర్‌వెల్ కెమెరా పరికరాన్ని సృష్టించాడు. దీని కోసం ఆయన ఏడాదిపాటు శ్రమించాడు.

బోర్‌వెల్ కెమెరాతో వెయ్యి అడుగుల లోపల ఇరుక్కున మోటర్ స్థితిగతులను తెలుసుకోవచ్చు. కెమెరాకు ఉండే ఎల్ఈడీ లైట్స్ ద్వారా మానిటర్ లో స్పష్టంగా చూడవచ్చు. దానిని బట్టి అడ్డున్న రాళ్లను, మట్టిని తొలగించడంతోపాటు మోటరు నీళ్లలో పడినా కెమెరాకు ఉంటే ప్లక్కర్స్(బేరింగ్)తో అవలీలగా బయటకు తీయవచ్చు. ఇలా వీరాచారి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా మోటర్లను బయటకు తీశాడు.

బోర్‌వెల్ కెమెరా సృష్టికర్త వీరాచారి తన అనుభవాలను ‘దిశ’తో పంచుకున్నారు. రైతులు కష్టాలు నేను స్వయంగా చూశా. బోరులో మోటర్ పడితే ఆ రైతులకు రూ.1.50 వరకు నష్టం వస్తుంది. అందుకే వారి కోసం నేను బాగా ఆలోచించి బోర్ వెల్ కెమెరాను తయారు చేశా. దీని ద్వారా కేవలం మూడు,నాలుగు వేలకే 100 శాతం విజయవంతంగా మోటర్లను తీస్తున్నాను. నాతో పాటు మరో ఆరుగురు వర్కర్లు ఉంటారు. నా పరికరం వల్ల వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పటి వరకు 4వేలకు పైగా మోటర్లను ఈ సాంకేతికను ఉపయోగించి బయటకు తీశాం. ఇలా సీసీ కెమెరాలను ఉపయోగించి కేవలం బెంగళూరులో ఇంజనీర్లు మాత్రమే మోటర్లు బయటకు తీస్తారు. అవసరం ఉన్న వాళ్లు 99590 35585 నంబర్ ను సంప్రదించవచ్చు.



Next Story

Most Viewed